వంగసాగులో మేలైన రకాల ఎంపిక!

శ్యామల రకం పంట 130-150 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి దిగుబడి 7-9 టన్నుల వరకూ ఇస్తుంది. పూస పర్పుల్‌ క్లస్టర్‌ రకం దీని పంట కాలం 135-145 రోజులు. ఎకరానికి 13-16 టన్నుల దిగుబడి పొందవచ్చు. పూస పర్పుల్‌ లాంగ్‌ రకం పంట 135-145 రోజుల్లో కాతకు వస్తుంది.

వంగసాగులో మేలైన రకాల ఎంపిక!

Selection of the best varieties in Vanga Cultivation!

Updated On : December 26, 2022 / 6:15 PM IST

వంగసాగును రైతులు దీర్ఘకాలిక పంటగా, స్వల్పకాలిక పంటగా చాలా మంది రైతులు సాగు చేపడుతున్నారు. చలికాలంలో వంగసాగును చేపట్టాలనుకొనే రైతులు నవంబర్‌ నుంచి డిసెంబర్‌లో నారు పోసుకునేందుకు అనుకూలంగా ఉంటుంది. వేసవిలో సాగుకోసం ఫిబ్రవరి నుంచి మార్చి మొదటి వారంలో నాటుకుంటే మంచిది. సారవంతమైన నేలలు, నీరు బాగా ఇంకే నేలలు వంగ సాగుకు అనుకూలంగా ఉంటాయి. చౌడు నేలల్లో వంకాయలను సాగు చేయకపోవడమే మంచిది. పంట వేయడానికి ముందే భూమిని పోషకాలతో బలంగా తయారు చేసుకోవాలి. భూమిని 2-3 సార్లు ట్రాక్టర్‌ కల్టివేటర్‌తో దున్నుకోవాలి.

చివరి దుక్కిలో 8 టన్నుల పశువుల ఎరువు, 25 కిలోల భాస్వరం, 25 కిలోల పొటాషియం వేసుకొని.. నేల మొత్తాన్ని కలియ దున్నుకోవాలి. ఎండు తెగులు నివారణకు మొదట్లోనే ఎకరం పొలానికి 6 కిలోల బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుకోవాలి. మొక్కల పెరుగుదలకు 13 డిగ్రీల సెంటిగ్రేడ్‌ నుంచి 20 డిగ్రీల సెంటిగ్రేడ్‌ మధ్య సగటు ఉష్ణోగ్రతలు అవసరం. వంకాయ విత్తనాలు 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌ వద్ద బాగా మొలకెత్తుతాయి.

వంగలో సాగుకు అనువైన రకాలు :

ప్రధానంగా భాగ్యమతి, శ్యామల, పూస పర్పుల్‌ క్లస్టర్‌, పూస పర్పుల్‌ లాంగ్‌, పూస క్రాంతి వంటివి మన ప్రాంతంలో సాగుకు అనుకూలంగా ఉంటాయి. భాగ్యమతి రకం పంట కాలం 150-165 రోజులు. ఎకరానికి 12-14 టన్నుల దిగుబడి వస్తుంది. శ్యామల రకం పంట 130-150 రోజుల్లో చేతికి వస్తుంది. ఎకరానికి దిగుబడి 7-9 టన్నుల వరకూ ఇస్తుంది. పూస పర్పుల్‌ క్లస్టర్‌ రకం దీని పంట కాలం 135-145 రోజులు. ఎకరానికి 13-16 టన్నుల దిగుబడి పొందవచ్చు. పూస పర్పుల్‌ లాంగ్‌ రకం పంట 135-145 రోజుల్లో కాతకు వస్తుంది. ఎకరానికి 13-16 టన్నుల వరకూ దిగుబడి ఉంటుంది. పూస క్రాంతి రకం పంట కాలం 135-150 రోజులు. ఎకరానికి దిగుబడి 14-16 టన్నుల వరకూ ఉంటుంది.

వంగలో ఉపజాతులు :

ముండ్ల వంగ : ఈ రకానికి వర్షాధారంగా సాగు చేయవచ్చు. నీటితో పెద్దగా పనిలేదు. తక్కువ తేమతో మొక్కలు పెరుగుతాయి. ఈ రకంలో ఆకుల దగ్గర, కాయ తొడిమల దగ్గర, పుష్పకోశాలపైనా ముండ్లు ఉంటాయి. కాయ గుండ్రంగా ఉంటుంది. నారు పెద్దగా ఎదిగి ఒక్కోసారి కిలో వరకూ తూగే కాయలు కాస్తాయి. కొన్ని కాయలపై చారలు కానీ, మచ్చలు కానీ ఉంటాయి. మిగతా వంగరకాలతో పోలిస్తే ముండ్ల వంగ రుచిగా ఉంటుంది.

గుత్తివంకాయ : ఈ రకం వంకాయలు చిన్నగా ఉండి, గుత్తులుగా కాస్తాయి. దిగుబడి తక్కువగా ఉండటం వల్ల దీన్ని పెద్దగా సాగు చేయడం లేదు. అయితే, మార్కెట్‌లో దీనికి డిమాండ్‌ మాత్రం ఎక్కువ.

ఆత్రేయపురం వంగ : ఆత్రేయపురం వంగ పొడవుగా, సన్నగా ఉండే కాయలను కాస్తుంది. ఇది కూడా మెట్ట ప్రాంతంలో పండించే రకం. దీనికి ముండ్లు ఉండవు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం ప్రాంతంలో ఎక్కువగా పండుతుంది. పచ్చి కాయలు ఆకుపచ్చగా, చారలు కలిగి ఉంటాయి. ఇది చలికాలంలో సాగుకు అనువైనదిగా చెప్పవచ్చు.

నీటి వంగ : ఈ రకం చలికాలంలో సాగుకు అనుకూలం. ఈ కాయలు సుమారు అంగుళం లావు, 25 సెం.మీ. నుంచి 30 సెం.మీ. వరకు పొడవు పెరుగుతాయి. కాయలు ఉదారంగులో, రుచికరంగా ఉంటాయి.

పోచవారి రకం : పోచవారి రకం గుండ్రటి కాయలు కలిగి ఉంటాయి. పెరట్లో పెంచుకోవడానికి అనువైన రకం. ఈ రకాలకు విదేశాల్లో భారీ డిమాండ్‌ ఉంటుంది. విదేశాలకు ఎగుమతి చేసే అవకాశం ఉన్నవారు ఈ రకాన్ని సాగు చేసుకుంటే మంచి అదాయం పొందవచ్చు.