Natural Farming : ప్రకృతి సాగువైపు రైతుల చూపు.. తక్కువ పెట్టుబడితో, నాణ్యమైన దిగుబడులు

Natural Farming : గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపద్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్యభద్రత కొసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు. 

Natural Farming : ప్రకృతి సాగువైపు రైతుల చూపు.. తక్కువ పెట్టుబడితో, నాణ్యమైన దిగుబడులు

Natural Farming

Natural Farming : వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి. అయితే విపరీతమైన రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం వల్ల, అధిక ఖర్చులే కాకుండా విషతుల్యమైన ఆహరం తయారవుతోంది. మరోవైపు వాతావరణ కాలుష్యం పెరుగుతోంది. దీని బారినుండి తప్పించుకునేందుకే ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంవైపు మొగ్గుచూపాల్సి అవసరం ఎంతైనా ఉంది.

Read Also : Solar Power Cultivation : సోలార్ విద్యుత్‎తో పంటల సాగు

సేంద్రియ వ్యవసాయం మనం అన్వేషించాల్సిన, పరిశోధించాల్సిన కొత్త పద్దతేమి కాదు. మన దేశంలో పూర్వికులు వందల సంవత్సరాల నుండి 60 ఏండ్ల క్రిందటి వరకు ఆచరిస్తూ వచ్చినదే. మనకు స్వాతంత్ర్యం వచ్చిన నాటికి ఆకలి చావులు ఎక్కువయ్యాయి. ఆహారధాన్యాల కోసం ఇతర దేశాలను ఆశ్రయించాల్సి వచ్చింది. హరిత విప్లవం తేవాలనుకున్నాం. ఆశయ సిద్ధికి అధిక దిగుబడి రకాలను, రసాయనిక పురుగు మందులను, రసాయన ఎరువులు వాడాం. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెంచాం. లక్ష్యం సాధించాం. అయితే దురదృష్టవశాత్తూ ఈ ప్రక్రియలో వాడిన రసాయనాలు ప్రకృతిమాత, భూమాతల ఆరోగ్యాన్ని చాలామటుకు దెబ్బతీశాయి. విచక్షణా రాహితంగా వాడిన పురుగుమందులు పీల్చేగాలి, తినే ఆహారాన్ని, తాగే నీటిని, కడకు చంటి పిల్లలు త్రాగే తల్లిపాలను కూడా కలుషితం చేశాయి.

తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తున్న సేంద్రియ సాగు :
అదే విధంగా సేంద్రియ ఎరువులను విస్మరించి విచ్చలవిడిగా వాడిన రసాయనిక ఎరువులు నేలను నిస్సారం, నిర్విర్యం, అచైతన్యం చేశాయి. దాదాపు దశాబ్దం కాలం నుండి, దిగుబడులలో చెప్పుకోదగిన పెరుగుదల కనిపించడంలేదు. రాబోయే రోజుల్లో ఈ సమస్య పరిష్కారానికి, నేల ఉత్పాదకత పెంచడానికి, సుస్థిర వ్యవసాయం ఎంతో అవసరం. ఆహార భద్రతకు ప్రకృతిలో సహజవనరులైన సేంద్రియ పధార్దాలను ఉపయోగించి, సక్రమమైన యాజమాన్య పద్ధతులతో, సుస్థిరమైన పంటల ఉత్పాదకతలతో, ఆరోగ్యవంతమైన పర్యావరణ వ్యవస్థను రూపొందించేందుకు సేంద్రియ వ్యవసాయం ఒక్కటే మార్గం.

గతంలో లాభాల కోసం రసాయనాల వెంటపడ్డారు రైతులు. నేడు లాభాలతో పాటు ఖర్చులు పెరిగాయి. అంతేకాకుండా దిగుబడులు తగ్గాయి. ఈ నేపద్యంలో ఇటు ఖర్చులు తగ్గించుకునేందుకు, ఆరోగ్యభద్రత కొసం సేంద్రియ వ్యవసాయం వైపు మళ్లారు.  కానీ ప్రస్తుతం సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొనే సమస్యలు చాలానే ఉన్నాయి. అసలు సేంద్రియ ఎరువుల ఉత్పత్తిని పెంచే మార్గాలేంటి? వాటి ఉత్పత్తికి ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలి, సేంద్రియ ఉత్పత్తులకు మార్కెట్‌ సౌకర్యం ఏవిధంగా మెరుగు పరుచుకొవాలి? దీనిపై నియంత్రణ ఏవిధంగా ఉండాలనే అంశాలతో పాటూ అందుబాటులో ఉన్న వనరులతో, సేంద్రియ ఎరువులు ఏవిధంగా తయారు చేసుకోవచ్చనే అవగాహన అధికారులు కల్పించాల్సిన భాధ్యత ఎంతైనా ఉంది. మరోవైపు సేంద్రియ వ్యవసాయం చేసే భూమిని సర్టిఫిగేషన్‌ ఎవరు చేస్తారు? చేస్తే ఈ సంస్థలు ఎక్కడ ఉన్నాయి?  ఉంటే రైతుల సమస్యలు నివృత్తి చేయాల్సిందే.  ఇన్ని సమస్యలుండి, దిగుబడి తక్కువగా ఉన్నా, రైతులు మాత్రం సేంద్రియ వ్యవసాయం వైపే మొగ్గు చూపుతున్నారు.

తక్కువ పెట్టుబడితో, నాణ్యమైన దిగుబడులంటున్న రైతులు :
ప్రకృతిలో సహజవనరులను ఉపయోగించి పర్యావరణాన్ని కాపాడుకుంటూ చేసే వ్యవసాయమే సేంద్రియ వ్యవసాయం. పంట మార్పిడి, విత్తన ఎంపిక , నీటి నిర్వాహణ, దుక్కిదున్నడం, అంతరసేద్యం కూడా ఇందులో భాగమే. పశువుల ఎరువులు, కోళ్లు, గొర్రెలు, పందులతోపాటు వర్మీకంపోస్టు, పచ్చిరొట్ట ఎరువులు, పిండి, చెరకుమడ్డి లాంటి జీవన ఎరువులు భూసారాన్ని పెంచేందుకు ఉపయోగించాలి. సేంద్రియ వ్యవసాయంలో వేప, వావిలి, కానుగ, సీతాఫలం వంటి జీవరసాయనాలతో సస్యరక్షణ చేపట్టితే మంచి దిగుబడే కాకుండా ఆరోగ్యమైన ఆహరాన్ని పొందవచ్చు…..

ఆహార భద్రతకు, పౌష్టికాహార ఉత్పత్తికి సేంద్రియ వ్యవసాయానికి మించిన మరో ఉత్తమ మార్గం లేదని వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఈ విధానంలో పంటలకు నష్టం వాటిల్లజేసే క్రిమి కీటకాలు, వాటి శత్రువులు, సేంద్రియ వ్యవసాయ విధానం.. ఈ మూడింటి మధ్య కొనసాగే సమతుల్యం కారణంగా, ఏ జీవి తన జనాభాను విపరీతంగా వృద్ది చేసుకునే పరిస్థితి ఉండదని వారంటున్నారు. రాని పంటల్లోకూడా ఒక విధమైన సమతుల్యత ఏర్పడుతుందని చెబుతున్నారు. సేంద్రియ వ్యవసాయం వల్ల అధిక దిగుబడులు సాధించడమే కాకుండా పర్యావరణ పరిరక్షణ చేపట్టవచ్చని వారు స్పష్టం చేశారు. సేంద్రియ వ్యవసాయం ఆచరణకు ఎంతగానో దోహదపడి, అవశేషాలులేని ఆహార ఉత్పత్తికి, సుస్థిరతకు నాంది పలికి మానవాళి జీవకోటి మనుగడకు, పర్యావరణ పరిరక్షణకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశిద్దాం.

Read Also : Green Black Gram Cultivation : వేసవి పెసర, మినుము సాగు యాజమాన్యం