Bhanu Prakash: టీటీడీ బోర్డు సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గత వైసీపీ హయాంలో తిరుమలలో భారీగా చోరీ జరిగిందన్నారు. పరకామణిలో పని చేస్తున్న రవికుమార్ దాదాపు 100 కోట్ల రూపాయల చోరీకి పాల్పడ్డారని ఆరోపించారు. చోరీ సమయంలో ఛైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి ఉన్నారని భాను ప్రకాశ్ గుర్తు చేశారు. చోరీ కేసులో సీబీఐ విచారణ జరుగుతోందని, త్వరలోనే నిజాలు బయటపడతాయన్నారు.
”పరకామణిలో అనేక అవకతవకలు జరిగాయి. ఆ రోజు పరకామణిలో దాదాపు 100 కోట్ల రూపాయల దొంగతనం జరిగింది. చెట్టు కింద పంచాయతీ చేసినట్లు అప్పుడున్న పెద్దలు లోక్ అదాలత్ లో కాంప్రమైజ్ చేసి స్వామి పేరుతో దాదాపు 40 కోట్ల విలువ చేసే ఆస్తులు రాయించుకున్నారు. ఒకే బిల్డింగ్ లో 13 అపార్ట్ మెంట్లు స్వామి వారి పేరుతో రాసుకున్నారు. చెట్టు కింద పంచాయతీ చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారు? ఈరోజు కోర్టు కూడా అదే ప్రశ్నించింది. వెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీ జరిగితే ఎవరిని తప్పించడానికి, ఎవరిని మెప్పించడానికి అప్పుడున్న అధికారులు రాజీకి వెళ్లారు?” అని టీటీడీ బోర్డు మెంబర్ భాను ప్రకాశ్ ప్రశ్నించారు.
తిరుమల పరకామణి చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. దీనిపై మంత్రి లోకేశ్ సైతం తీవ్రంగా స్పందించారు. ట్విట్టర్ వేదికగా వైసీపీ నేతలపై సంచలన ఆరోపణలు చేశారాయన. పరకామణిలో 100 కోట్ల రూపాయల దోపిడీ వెనుక జగన్, భూమన అందరూ నిందితులే అని లోకేశ్ ఆరోపించారు. వైసీపీ పాలనలో తిరుమల శ్రీవారి సొత్తును కూడా దోచుకున్నారని ఆయన ధ్వజమెత్తారు. అలా దోచిన డబ్బును రియల్ ఎస్టేట్ లో పెట్టబడిగా పెట్టారని లోకేశ్ ఆరోపించారు.