Chandrababu : టీడీపీతో టచ్‌లో 40మంది ఎమ్మెల్యేలు? రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన చంద్రబాబు వ్యాఖ్యలు

శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.

Chandrababu Sensational Words

చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. టీడీపీలో చేరాలనుకున్న నాయకులు మంచి వారైతే ఆలోచిస్తాము కానీ ఎవరిని పడితే వారిని తీసుకునే ప్రసక్తే లేదని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. ఇంతకీ టీడీపీలోకి వచ్చే నాయకులు ఎవరు? చంద్రబాబు వ్యాఖ్యల వెనుక ఉద్దేశ్యం ఏమిటి?

అధికార పార్టీ వైసీపీ ప్రక్షాళనపై దృష్టి పెట్టడంతో అసంతృప్త నేతలు పక్క చూపులు చూస్తున్నారనే ప్రచారం హీట్ పుట్టిస్తోంది. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. దాంతో రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలలో కొందరికి టికెట్లు ఇవ్వకుండా పక్కన పెడుతున్న అధికార వైసీపీ మరికొందరిని పక్క నియోజకవర్గాలకు మారుస్తోంది.

దీంతో ఆ పార్టీలో టికెట్లు దక్కని వారు, నియోజకవర్గం మార్చడాన్ని జీర్ణించుకోలేని నేతలు పక్క చూపులు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇలా ప్రత్యామ్నాయంపై ఆలోచన చేస్తున్న వారంతా ప్రతిపక్ష పార్టీ టీడీపీతో టచ్ లోకి వెళ్తున్నట్లు చెబుతుండటం ఆసక్తికరంగా మారింది. అయితే, టీడీపీలోకి వస్తామంటున్న వైసీపీ నేతలు అందరినీ చేర్చుకునేది లేదని చంద్రబాబు చెప్పడమే కాకుండా ఒకరిద్దరిని తిరస్కరించామని లీకులు ఇస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారింది.

Also Read : సీఎం జగన్ సంచలన నిర్ణయం, వైసీపీలో భారీ మార్పులు

వైసీపీలో మెజార్టీ ఎమ్మెల్యేలను మార్చుతారని, వీరిలో కొందరికి మరో చోటుకి బదిలీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇది ఎంతవరకు నిజమో కానీ.. టీడీపీ ఈ ప్రచారాన్ని వాడుకుని 40మంది వైసీపీ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు చేస్తున్నారని చెబుతోంది. ఇలా టీడీపీతో టచ్ లో ఉన్నవారిలో విజయనగరం జిల్లాకు చెందిన ఓ కీలక నేత కుటుంబసభ్యులు, ప్రకాశం జిల్లాకు చెందిన ఓ ముఖ్య నేత పేరు తెరపైకి తెస్తుండటం రాజకీయవర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ రెండు జిల్లాల్లో వైసీపీకి అన్నీ తామై వ్యవహరిస్తున్న ఆ నేతలు టీడీపీలోకి వెళ్లేందుకు ప్రయత్నించడం కరెక్టేనా? అసలు ఆ నేతలు పార్టీ మారే ఛాన్స్ ఉంటుందా? అనే చర్చ జరుగుతోంది.

అయితే, ఆ నేతలకు స్థానికంగా ఉన్న సమస్యల వల్ల పార్టీ మారే ఆలోచన చేస్తున్నారని, వారిని పార్టీలో చేర్చుకోవాలా? వద్దా? అని తాము ఆలోచిస్తున్నామని టీడీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఎలాగైతే కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి నేతలు క్యూ కట్టారో ఇప్పుడు వైసీపీ నుంచి టీడీపీలోకి అదే స్థాయిలో చేరికల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు సైకిల్ పార్టీ నేతలు.

ఇప్పటికే నెల్లూరు జిల్లా నుంచి ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరిపోయారు. సీనియర్ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే టీడీపీ తీర్థం పుచ్చుకోగా.. రాజధాని ప్రాంతానికి చెందిన తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తాజాగా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. వీరిద్దరూ ఎమ్మెల్సీ ఎన్నికల నుంచి టీడీపీతో కలిసి పని చేస్తున్నా.. ఇన్నాళ్లూ అధికారికంగా చేరలేదు.

Also Read : ఏపీ రాజకీయాల్లో సంచలనం..! టీడీపీతో టచ్‌లోకి వచ్చిన ప్రశాంత్ కిశోర్..!

వీరి బాటలోనే మరికొందరు ఎమ్మెల్యేలు త్వరలోనే టీడీపీలో చేరే అవకాశం ఉందంటున్నారు ఆ పార్టీ నేతలు. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన ఐదుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారని బాంబు పేల్చారు టీడీపీ నేత బోండా ఉమ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లా నుంచి చాలామంది నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని అంటున్నారు.

ఎమ్మెల్యేలే కాకుండా ఇద్దరు ఎంపీలు కూడా తెలుగుదేశంలోకి వస్తామని అంటున్నారట. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ కీలక నేత, మాజీమంత్రి సైతం సైకిల్ ఎక్కేందుకు ఉబలాటపడుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీ బలంగా ఉన్న చోట, సమర్థులైన నేతలు ఉన్న చోట వైసీపీ నుంచి ఎవరినీ తీసుకోకూడదని, బలమైన నేతలు వస్తామంటే ఆలోచిద్దామని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

అయితే, వైసీపీ నుంచి టీడీపీలోకి వలసలు అంటూ చంద్రబాబు చేస్తున్న ప్రచారంపై వైసీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వలసల ప్రచారం టీడీపీ మైండ్ గేమ్ లో భాగమే అని అంటున్నారు. ఎన్నికల్లో వైసీపీని దెబ్బకొట్టేందుకు చంద్రబాబు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.