Chandrababu Naidu : చంద్రబాబుతో న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా సమావేశం.. కేసులపై సుదీర్ఘ చర్చ

దాదాపు 3 గంటల పాటు చంద్రబాబుతో ఆయన సమావేశం అయ్యారు. కేసుల గురించి సుదీర్ఘంగా చంద్రబాబుతో చర్చలు జరిపారు లూథ్రా. Chandrababu Cases

Advocate Sidharth Luthra meets chandrababu naidu

Chandrababu Cases : టీడీపీ అధినేత చంద్రబాబుతో అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా సమావేశం అయ్యారు. చంద్రబాబుకి సంబంధించిన కేసులపైన సుదీర్ఘంగా చర్చించారు. సీఐడీ వరుసగా పెడుతున్న కేసులను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై చంద్రబాబుతో లూథ్రా సమాలోచనలు జరిపారు. చంద్రబాబు కేసులను సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్న సంగతి తెలిసిందే.

విజయవాడ ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టులో ఆయన వాదనలు వినిపించారు . ఇటీవల చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన విషయం విదితమే. దీంతో చంద్రబాబుతో లూథ్రా భేటీ అయ్యారు. దాదాపు 3 గంటల పాటు చంద్రబాబు ఆయన సమావేశం అయ్యారు. కేసుల గురించి సుదీర్ఘంగా చంద్రబాబుతో చర్చలు జరిపారు లూథ్రా. ఏపీ సీఐడీ వరుసగా నమోదు చేస్తున్న కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి అనే వ్యూహంపై సిద్ధార్థ్ లూథ్రా చంద్రబాబుతో చర్చించారు.

ప్రధానంగా స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో క్వాష్ పిటిషన్ కు సంబంధించిన ఈ నెల 8న సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దాంతో పాటు ఈ నెల 10న హైకోర్టులో కూడా రెగులర్ బెయిల్ పిటిషన్ పైనా తీర్పు వెలువడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆ తీర్పులు ఏ విధంగా ఉండనున్నాయి? తీర్పుని బట్టి తదుపరి ఎటువంటి వ్యూహాన్ని అనుసరించాలి? కేసులను ఏ విధంగా ఎదుర్కోవాలి? న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఈ అంశాలపై చంద్రబాబుతో సిద్ధార్థ్ లూథ్రా సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read : పురంధేశ్వరి లేఖలకు బెదిరేవారెవరూ లేరు.. ఆమె గతాన్ని చూస్తే..: కొడాలి నాని

52 రోజుల తర్వాత జైలు నుంచి విడుదల..
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబు సెప్టెంబర్ 9 అరెస్ట్ అయ్యారు. 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఏపీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. అనారోగ్య కారణాలతో ఆయనకు నాలుగు వారాల పాటు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది కోర్టు.

చంద్రబాబుపై వరుస కేసులు..
వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబును వరుస కేసులు వెంటాడుతున్నాయి. చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఉచిత ఇసుక పాలసీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపిస్తూ చంద్రబాబు సహా మరికొందరు టీడీపీ నేతలపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు.

ఇసుక అక్రమాల కేసు..
ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్‌, ఏ-4గా దేవినేని ఉమను నిందితులుగా చేర్చారు. వెంకటరెడ్డి.. అక్టోబర్ 3న సీఐడీకి ఫిర్యాదు ఇవ్వగా నవంబర్ 1న కేసు నమోదైంది. ఆ ఎఫ్‌ఐఆర్‌ను సీఐడీ అధికారులు ఏసీబీ న్యాయస్థానానికి సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో 10వేల కోట్ల మేరకు ఇసుక దోపిడీ జరిగిందని సీఐడీ ఆరోపిస్తోంది.

మొత్తం 6 కేసులు నమోదు..
చంద్రబాబుపై తాజాగా ఇసుక అక్రమాల కేసుతో కలిపి ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంశాల్లో సీఐడీ.. అంగళ్లు ఘర్షణపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మద్యం కేసు, ఇప్పుడు ఇసుక అక్రమాల కేసు నమోదైంది.

Also Read : పురందేశ్వరిపై మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు చేసిన విజయసాయిరెడ్డి

స్కిల్ డెవలప్‌మెంట్ కేసు ఉండగానే ఫైబర్ నెట్ కేసు నమోదైంది. ఆ తర్వాత ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో కూడా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మద్యం కేసులో చంద్రబాబుని ఏ-3 నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా నిందితుడిగా చేర్చింది. తాజాగా చంద్రబాబుపై ఇసుక అక్రమాల కేసు నమోద చేసింది సీఐడీ.