అదిగదిగో అమరావతి.. ఆంధ్రుల రాజధానికి నూతన కళ, మళ్లీ మహా నగర నిర్మాణ పనులు మొదలు

అమరావతి రాజధాని అన్నది ఇక చరిత్రేనని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహా నగర నిర్మాణానికి అవకాశం లభించింది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా, సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయ్.

Ap Capital Amaravati : శాతవాహనుల కాలంలో ఆంధ్రుల రాజధానిగా ఓ వెలుగు వెలిగింది అమరావతి. ఆ స్ఫూర్తితోనే నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి నిర్మాణం ప్రారంభమైంది. విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఆంధ్రప్రదేశ్ కు ఆ లోటు తీర్చేందుకు అమరావతి నిర్మాణం మొదలైంది. చారిత్రక, సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఉన్న అమరావతి స్ఫూర్తితో రాజధానిని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు శర వేగంగా ప్రయత్నాలు జరిగాయి. అమరావతికి అంతర్జాతీయంగా గుర్తింపు తేవాలన్న లక్ష్యంతో అందరూ ముందుకు కదిలారు. ముఖ్యమంత్రి నుంచి కింది స్థాయి ఉద్యోగుల దాకా ప్రతీ ఒక్కరు ఆగమేఘాల మీద పరుగులు పెట్టి పనులు చేశారు.

కలల సౌధం నిర్మాణం కొంత మేర సాగాక పరిస్థితులు ప్రతికూలంగా పరిణమించాయి. ప్రభుత్వం మారిపోయింది. అమరావతి నిర్మాణం ఆగిపోయింది. ఐదేళ్ల పాటు నిలిచిపోయింది. ఉజ్వల వైభవానికి ప్రతీకగా ఉంటుందనుకున్న ప్రాంతం పిచ్చి మొక్కల నిలయంగా మారింది. రూపురేఖలు కోల్పోయింది. అమరావతి రాజధాని అన్నది ఇక చరిత్రేనని అనుకుంటున్న సమయంలో మళ్లీ మహా నగర నిర్మాణానికి అవకాశం లభించింది. కృష్ణమ్మ తీరాన సగర్వంగా, సమున్నతంగా అమరావతి ఉనికి చాటేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయ్.

ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలుస్తోంది అనగానే… ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికి ముందుగా గుర్తొచ్చిన అంశం అమరావతి. ఐదేళ్ల పాటు రాజధానిపై రాజ్యమేలిన అస్పష్టతకు తెరపడుతుందన్న అభిప్రాయం అంతటా నెలకొంది. రాజధాని కోసం ఉద్యమించిన రైతులతో పాటు అమరావతే రాజధానిగా కొనసాగాలని కోరుకున్న వారందరికి ఉపశమనం కలిగింది. నవ్యాంధ్ర ఏకైక రాజధానిగా అమరావతి.. ప్రపంచ స్థాయి నగరంగా మారనుందన్న ఆశలు మళ్లీ మొదలయ్యాయి. అందరూ భావించినట్లుగానే కొత్త ప్రభుత్వం ఏర్పడక ముందే అమరావతి పునర్ వైభవానికి అడుగులు పడ్డాయ్. మొదట ఐదేళ్ల క్రితం నాటి పరిస్థితుల్లోకి అమరావతిని తీసుకెళ్లి ఆ తర్వాత అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే ప్రణాళిక అమలవుతుంది.

Also Read : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..! మంత్రివర్గం కూర్పుపై చంద్రబాబు కసరత్తు.. ఉమ్మడి జిల్లాల వారిగా రేసులో ఉంది వీరే..