తిరుమల లడ్డూకి అంత రుచి ఎలా వస్తుంది? అందులో ఏయే పదార్థాలు వాడతారు? దాని చరిత్ర ఏంటి?

నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ కమ్మని లడ్డూ రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

తిరుమల తిరుపతి లడ్డూ అంశం వివాదాస్పదమైన వేళ దేశ వ్యాప్తంగా దీనిపైనే అందరి దృష్టి మళ్లింది. ఎవరైనా తిరుపతికి వెళ్లారంటే లడ్డూ ప్రసాదం తెచ్చారా? అని తెలిసిన వారు అడుగుతారు. తిరుమల తిరుపతి ఎంత ఫేమసో, అక్కడ లడ్డూ కూడా అంతే ఫేమస్. నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఆ కమ్మని లడ్డూ రుచి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

ఆ లడ్డూ రుచికి అసలు తిరుమల లడ్డూకి అంత రుచి ఎలా వస్తుంది? అందులో ఏయే పదార్థాలు కలుపుతారు? లడ్డూ వెనక ఉన్న కథ ఏంటో తెలుసా? పూర్తి వివరాలు తెలుసుకుందాం..

అప్పట్లో వడ.. ఇప్పుడు లడ్డూ..
తిరుమల తిరుపతి శ్రీవారి ప్రసాదం లడ్డూకి పేటెంట్ హక్కు కూడా ఉంది. ఈ లడ్డూ తయారీ పద్ధతిని మరెవరూ కాపీ కొట్టడానికి వీల్లేదు. శ్రీవారి ప్రసాదంలో 15వ శతాబ్ది-20వ శతాబ్ది తొలినాళ్ల మధ్య వరకు వడకు చాలా ప్రాధాన్యం ఉండేది. అప్పట్లో తిరుమలకు వెళ్లిన భక్తులకు భోజన సదుపాయాలు ఉండేవి కాదు.

ఈ ప్రసాదాలతోనే భక్తులు ఆకలిని తీర్చుకునేవారు. 19వ శతాబ్ది మధ్య భాగంలో వడ తర్వాత తీపి బూందీని ప్రసాదంగా ఇవ్వడం ప్రారంభించారు. 1940 నాటికి అది లడ్డూగా మారింది. 1940 ప్రాంతంలో కల్యాణం మొదలైనప్పుడు లడ్డూ తయారీ మొదలైంది. 15వ శతాబ్ది-20వ శతాబ్ది తొలినాళ్ల మధ్య వడ ప్రసాదానికి ఎంత ప్రాధాన్యం ఉందో ఇప్పుడు లడ్డూ ప్రసాదానికి అంత ప్రాధాన్యం ఉంది.

Laddu

లడ్డూల తయారీకి ప్రత్యేక పద్ధతి
తిరుమలలో గర్భాలయానికి శ్రీవారి పోటుకు ముందు వకుళామాత విగ్రహం ఉంటుంది. ఆగ్నేయంగా నిర్మించిన పోటులోనే ప్రసాదాలను తయారుచేస్తుంటారు. ప్రసాదాన్ని శ్రీనివాసుని తల్లి వకుళామాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. మాత ముందు ఉంచిన అనంతరం స్వామివారికి నైవేద్యంగా సమర్పిస్తారు. లడ్డూతో పాటు వడలు, ఇతర ఫలహారాలు ఆలయంలోని సంపంగి ప్రాకారం ఉత్తర భాగంలో తయారు చేస్తుంటారు.

లడ్డూల తయారీకి ప్రత్యేక పద్ధతిని పాటిస్తారు. ఆలయంలో లడ్డూల తయారీకి కోసం వాడే వస్తువులు, సరుకుల మోతాదును దిట్టం అంటారు. తొలిసారిగా 1950లో దిట్టంను నిర్మించి, దాన్ని క్రమంగా విస్తరిస్తూ వచ్చారు. చివరిసారిగా 2001లో దిట్టాన్ని (పడితరం దిట్టం స్కేలు) సవరించారు. పడి 51 వస్తువులు అని అర్థం. మొదట్లో 5,100 లడ్డూలు మాత్రమే తయారయ్యేవి. 5,100 లడ్డూల తయారీకి 803 కిలోల సరుకులను వాడుతుంటారు.

ఏయే పదార్థాలు వాడతారు?
ఒక్క దిట్టంలో ఆవు నెయ్యి 165 కిలోలు, చక్కెర 400 కిలోలు, శనగపిండి 180 కిలోలు, ఎండు ద్రాక్ష 16 కిలోలు, యాలకులు 4 కిలోలు, కలకండ 8 కిలోలు, జీడి పప్పు 30 కిలోలు వాడతారు. ఇలా ఒక్కో దిట్టం నుంచి 5,100 లడ్డూలను తయారు చేస్తుంటారు. తొలినాళ్లలో ఈ లడ్డూల తయారీకి కట్టెల పొయ్యి వాడగా, ఇప్పుడు గ్యాస్ వినియోగిస్తున్నారు. పోటులో లడ్డూల తయారీకి శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు దాదాపు 750 మంది ఉన్నారు.

ఏది ఏమైనా నిత్య కల్యాణం.. పచ్చతోరణం.. ఇది శ్రీవారి క్షేత్రం ప్రత్యేకత. ప్రతీరోజు స్వామివారి సన్నిధిలో కల్యాణంతో పాటు ఆర్జిత సేవలు జరుగుతాయి. తిరుమల వెంకన్న సన్నిధిలో స్వామివారి పూజా విశేషాలు, దర్శనం, పుష్కరిణి.. భక్తులు సమర్పించే తలనీలాలకు ఎంత ప్రాధాన్యత ఉందో..స్వామివారి లడ్డూ ప్రసాదానికి కూడా అంతే ప్రత్యేకత ఉంది.

ఆ శ్రీనివాసుడి దర్శనం ఎంత ఎమోషన్‌గా ఫీలవుతారో.. స్వామివారి ప్రసాదం అంటే కూడా అంతే స్పెషల్‌గా భావిస్తారు భక్తులు. తిరుపతికి వెళ్లామంటే చాలు ఎవరైనా టక్కున అడిగేది లడ్డూ. దునియా మొత్తం ఫిదా అయ్యే శ్రీవారి ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. హిస్టరీ, ఇంపార్టెన్స్‌పై ఎన్నో చర్చలు ఉన్నాయి. శ్రీవారి లడ్డూ ప్రసాదం క్వాలిటీ, క్వాంటిటీ, రుచి అయితే వర్ణనాతీతం.

ఇప్పుడు మేము టీటీడీకి నెయ్యి సరఫరా చేయడం లేదు: ఏఆర్ డెయిరీ సంస్థ