AP New Airport : ఏపీ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రంలో మరో కొత్త ఎయిర్ పోర్ట్.. ఏకంగా 1332 ఎకరాల్లో
New Airport in AP : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. ఆ జిల్లాలో మరో కొత్త విమానాశ్రయం నిర్మించబోతున్నారు.
AP new airport in nellore dagadarthi project will begin soon
- ఏపీలో కొత్త విమానాశ్రయం
- నెల్లూరు జిల్లాలో నిర్మాణం
- త్వరలోనే పనులు ప్రారంభం
AP New Airport : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభవార్త.. రాష్ట్రంలో మరో కొత్త విమానాశ్రయం నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అతి త్వరలోనే ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. నెల్లూరు జిల్లాలో త్వరలోనే ఈ కొత్త విమానాశ్రయానికి శంకుస్థాపన చేయనున్నారు. సుమారు 1332 ఎకరాల్లో ఈ విమానాశ్రయాన్ని నిర్మించబోతున్నారు. ఈ విమానాశ్రయాన్ని జాతీయ రహదారులు, పోర్టులు, పారిశ్రామిక జోన్లకు అనుసంధానించనున్నారు. దీని వల్ల నెల్లూరు జిల్లా, చుట్టుపక్కల ప్రాంతాలు పారిశ్రామికంగా అభివృద్ధి సాధించేందుకు అవకాశం లభిస్తుందని అంటున్నారు. దీంతో పాటు పర్యాటకం, లాజిస్టిక్స్ దాని అనుబంధ రంగాలు మరింతగా అభివృద్ధి చెందుతాయని అంచనా వేస్తున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణం పూర్తి అయ్యి అందుబాటులోకి వస్తే.. నెల్లూరు జిల్లా ముఖ చిత్రం మారిపోతుంది అంటున్నారు. త్వరలోనే ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణం పనులు చేపడతామని తెలిపారు.
ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను దశలవారీగా చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. తొలి విడతలో 1.4 లక్షల మంది ప్రయాణికుల వార్షిక సామర్థ్యంతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత దాన్ని 15 మిలియన్ల వరకు పెంచేలా సౌకర్యాలు కల్పించనున్నారు. ఇక భవిష్యత్తులో ఈ విమానాశ్రయంలో కార్గో ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
అయితే ఇప్పటికే ఈ ఎయిర్పోర్ట్ కోసం భూసేకరణ, విద్యుత్, నీరు, టెలిఫోన్ కనెక్టివిటీ కోసం ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో 54 కోట్లు విడుదల చేసింది. ఈ క్రమంలో వీలైనంత త్వరగా పనులు చేపట్టేందుకు అధికారులు రెడీ అవుతున్నారు. జూన్ లేదా జూలైలో దగదర్తి ఎయిర్పోర్ట్ పనులకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా ప్రకటించారు.
