వైసీపీలో టికెట్ల టెన్షన్.. అభ్యర్థుల మార్పుపై మంత్రుల కీలక వ్యాఖ్యలు

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టికెట్ల టెన్షన్ కొనసాగుతోంది. అభ్యర్థులను మార్చడంపై భిన్నవాదనలు విన్పిస్తున్న నేపథ్యంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించారు.

YCP Ministers: వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కసరత్తు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇందులో భాగంగా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేల స్థానాలను మార్చారు. ఇంకా కొంతమందిని కూడా మార్చే అవకాశముందని తెలుస్తోంది. సర్వేల ఆధారంగానే సీఎం కసరత్తు చేస్తున్నారని, గెలుపు అవకాశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని మార్పులు చేస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు జగన్ చెల్లెలు షర్మిల.. చంద్రబాబు కుటుంబానికి క్రిస్మస్ కానుకలు పంపడం, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. టీడీపీ అధినేత చంద్రబాబును కలవడంతో ఏపీ రాజకీయాలు హీటెక్కాయి. తాజా పరిణాలపై పలవురు మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు స్పందించారు.

అభ్యర్థుల మార్పుపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
చిత్తూరు : అభ్యర్థుల మార్పుపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు గెలవలేని చోట అభ్యర్థులను మార్చడం అనేది అన్ని పార్టీలలో సాధారణంగా జరిగేదనని అన్నారు. తాము టికెట్టు కేటాయించని వ్యక్తులను లాక్కుని టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు చూస్తున్నారని ఆరోపించారు. ”మా దగ్గర గెలవలేని వ్యక్తి మీ దగ్గర ఎలా గెలుస్తాడో చంద్రబాబు నాయుడు చెప్పాల”ని ప్రశ్నించారు. అభ్యర్థుల మార్పు పార్టీ అంతర్గత విషయమని డిప్యూటీ సిఎం నారాయణ స్వామి అన్నారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇద్దరు పీకేలను విమర్శించి వాళ్ళనే ఇప్పుడు చంద్రబాబు పక్కన పెట్టుకున్నారని.. ఇలాంటి అవినీతి వ్యక్తిని తాను చూడలేదని వ్యాఖ్యానించారు.

జగనన్న చెబితే సీటు వదులుకుంటా: మంత్రి రోజా
గుంటూరు జిల్లా మంగళగిరిలో ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ.. ”రాష్ట్రంలో జగనన్న పాలన విషయంలో ఎవరు అసంతృప్తిగా లేరు. అంతా మీడియా సృష్టి. నగరి ఎమ్మెల్యే విషయంలో నాకు టికెట్ లేదని జగనన్న అంటే మనస్పూర్తిగా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. షర్మిల లోకేష్ కు టీవీల్లో శుభాకాంక్షలు తెలిపినంత మాత్రానా అది శుభాకాంక్షలు కాద”ని అన్నారు.

Also Read: జగన్ వదిలిన బాణం ఆయనకే గుచ్చుకోబోతుంది.. ఇంత కంటే రుజువు కావాలా?

జగన్ మాటే శిరోధార్యం: ఎంపీ మోపిదేవి
సీఎం జగన్ మాటే తనకు శిరోధార్యమని ఎంపీ మోపిదేవి వెంకటరమణ అన్నారు. తనకు టిక్కెట్టు కేటాయించకపోవడంతో మత్స్యకార సామాజిక వర్గ పెద్దలు అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమేనని, రాజకీయపరమైన నిర్ణయాలకు సామాజిక వర్గానికి ముడి పెట్టటం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. బాపట్ల జిల్లా రేపల్లె లో మీడియాతో మాట్లాడుతూ.. అధిష్టాన నిర్ణయాన్ని గౌరవించాలని తన సామాజిక వర్గ పెద్దలతో మాట్లాడతానని చెప్పారు. ఉపాధ్యాయుల అవార్డుల కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన తన మాటలను వక్రీకరించారని.. సందర్భాన్ని బట్టి మాట్లాడిన మాటలను రాజకీయగా వక్రీకరించి పైశాచికత్వం పొందుతున్నారని మండిపడ్డారు. కొన్ని పత్రికలు తనపై దుష్ప్రచారం చేస్తున్నాయని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

Also Read: గత పదేళ్లలో బాలయ్యలో ఎప్పుడూ చూడని మార్పు.. హిందూపురం టీడీపీలో కీలక పరిణామాలు

రాయదుర్గంలో మళ్లీ నేనే పోటీ చేస్తా: కాపు రామచంద్రారెడ్డి
అనంతపురము : రాయదుర్గంలో మళ్లీ తానే పోటీ చేస్తానని, టికెట్ విషయంపై అధిష్టానం తనతో చర్చించలేదని.. ఇప్పటివరకు అలాంటి ప్రస్తావన కూడా రాలేదని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. రాయదుర్గంలో ఎంతో అభివృద్ధి చేశానని, మళ్లీ తనకే టిక్కెట్ దక్కుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఓటమి భయంతో కాల్వ శ్రీనివాసులు వణికిపోతున్నారని, తనపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. మంత్రిగా పనిచేసినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారని విమర్శించారు.

Also Read: ఎన్నికల వేళ వైసీపీకి టీడీపీ బిగ్ షాక్..! పీకేను దూరం చేసిన నారా లోకేశ్

జీవితాంతం జగన్ తోనే: ఎమ్మెల్యే పర్వత
సీఎం జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ స్పష్టం చేశారు. తాను పార్టీ మారుతున్నట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. జీవితాంతం వైఎస్ జగన్ తోనే ప్రయాణం చేస్తానని అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలోకి వెళ్తున్నట్టుగా రాసిన వార్తలు చూసి ఆశ్చర్యానికి గురయ్యానని.. నిజాలు తెలుసుకుని ప్రచురిస్తే బాగుంటుందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు