వైసీపీ సిట్టింగ్‌ల్లో టికెట్ టెన్షన్.. మార్పు చేర్పులతో ఎమ్మెల్యేల్లో అలజడి

నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. సర్వేల్లో రోజాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Andhra Pradesh assembly polls 2024: అధికార వైసీపీలో నియోజకవర్గ ఇన్‌చార్జుల మార్పు.. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో గుబులు పుట్టిస్తోంది. వచ్చే ఎన్నికల్లో సీటు ఖాయమని ఆశలు పెట్టుకున్న నేతలకు షాక్ ఇచ్చేలా హైకమాండ్ నిర్ణయాలు తీసుకుంటుండటంతో ఎవరిపై వేటు పడుతుందోననే చర్చ మొదలైంది. ముఖ్యంగా వైసీపీకి కంచుకోటలాంటి చిత్తూరు జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. వీరిని తప్పిస్తారనే టాక్ ఎక్కువవుతుండటంతో కంటిమీద కునుకులేకుండా గడుపుతున్నారు.

చిత్తూరు జిల్లాలో మొత్తం 14 స్థానాలు ఉండగా, కుప్పం మినహా మిగిలిన 13 చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ 13 మంది ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎస్సీ రిజర్వు స్థానాల నుంచి గెలుపొందగా, జనరల్ కేటగిరీలో ఉన్న 10 నియోజకవర్గాల్లో ఏడు చోట్ల అగ్రవర్ణాలకు చెందిన రెడ్డి సామాజిక వర్గ నేతలే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరంతా సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితులు కావడంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ పోటీపై గంపెడాశలు పెట్టుకున్నారు. అయితే వీరిలో కొందరు ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు వైసీపీ అధిష్టానం చేయించిన అంతర్గత సర్వేల్లో తేలడంతో మార్పు సంకేతాలు అందుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా నేతలు ఒకటే టెన్షన్ అనుభవిస్తున్నారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏడుగురు రెడ్డి సామాజిక వర్గ నేతలు కాకుండా మరో ముగ్గురు బీసీ, మైనార్టీ ఎమ్మెల్యేలు గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బీసీ సమీకరణలో భాగంగా ఆ వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయించాలని తలిస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కొందరిపై వేటు తప్పదనే ప్రచారం జరగుతోంది. ఇలా రెండు రకాలుగా సీటు గల్లంతయ్యే అవకాశం ఉండటంతో ఒకరిద్దరు తప్ప మిగిలిన నేతలు అంతా టెన్షన్ పడుతున్నారు. ఇటీవల గుంటూరు జిల్లాలో పది స్థానాల్లో ఇన్‌చార్జులను మార్చిన వైసీపీ.. రాష్ట్రవ్యాప్తంగా మార్పులు ఉంటాయని ప్రకటించడంతో చిత్తూరులో ఎక్కడెక్కడ కొత్తవారు వస్తారనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లా అయిన ఉమ్మడి చిత్తూరులో గత ఎన్నికల్లో హవా చూపిన వైసీపీ వచ్చే ఎన్నికల్లోనూ అదే జోరు చూపాలని ఉవ్విళ్లూరుతోంది. దీంతో ఎక్కడెక్కడ మార్పు జరిగే అవకాశం ఉందనే విషయమై ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది.

జిల్లాలో పుంగనూరు నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లి నుంచి పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకనాథరెడ్డి, చంద్రగిరి నుంచి చెవిరెడ్డి కుటుంబం, కుప్పం నుంచి ఎమ్మెల్సీ భరత్, శ్రీకాళహస్తి నుంచి బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తనయుడు అభినయ్ రెడ్డికి టికెట్టు ఖరారు అయినట్లు ప్రచారం జరుగుతుండగా, ఇదే సీటును తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష బీసీ మహిళ కోటాలో ఆశిస్తున్నారు.

ఇక నగరి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి రోజా విషయంలో అధిష్టానం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు చెబుతున్నారు. సర్వేల్లో రోజాకు ప్రతికూల ఫలితాలు వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ఇక్కడ ప్రత్యామ్నాయ నేతను బరిలోకి దింపాలని అధిష్టానం ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీలోనే తీవ్ర అసమ్మతి మంత్రి రోజాకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. అదేవిధంగా పీలేరులో చింతల రామచంద్రారెడ్డి పేరు మరోసారి బలంగా వినిపిస్తున్నప్పటికీ సర్వేలలో ఆయనకు ప్రతికూల రిపోర్టు వచ్చినట్లు చెబుతున్నారు. ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీచేయనున్న నల్లారి కిషోర్కుమార్రెడ్డిపై బలమైన అభ్యర్థిని బరిలో దింపాలని భావిస్తోంది వైసీపీ అధిష్టానం. వైసీపీలో బలమైన నాయకుడు లేకపోవడంతో.. మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి ఎవరో ఒకరిని పోటీకి దింపే ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు.

ఇక చిత్తూరులో ప్రస్తుతం ఆరణి శ్రీనివాసులు సిట్టింగ్ ఎమ్మెల్యే గా ఉన్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాసులుకు పోటీగా విజయానంద రెడ్డి అనే నేత టికెట్ కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. విజయానంద రెడ్డికి టికెట్ ఖరారైతే బలిజ సామాజిక వర్గాన్ని పార్టీ ఎలా భర్తీ చేస్తారన్నది సందిగ్ధంగా మారింది. పలమనేరులో వెంకట గౌడ సిట్టింగ్ ఎమ్మెల్యే. ఈయన ఏకైక బీసీ ఎమ్మెల్యే. కానీ సర్వేలు ఎమ్మెల్యేకు ప్రతికూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇక్కడ నుంచి టీడీపీ తరఫున మాజీ మంత్రి అమర్నాథరెడ్డి పోటీచేయనున్నారు. దీంతో సరైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది వైసీపీ.. మరోవైపు మదనపల్లి నుంచి నవాజ్ భాషా ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయన జిల్లాలో ఏకైక ముస్లిం మైనారిటీ ఎమ్మెల్యే. మదనపల్లిలో ముస్లిం ఓటుబ్యాంకు గణనీయంగా ఉండటంతో ఆయన తప్పించే చాన్స్ లేదంటున్నారు. కానీ, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పారెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. తిప్పారెడ్డికి చాన్స్ ఇస్తే మైనారిటీలను ఎలా సర్దుబాటు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Also Read: విశాఖపై పట్టుపెంచుకోడానికి వైసీపీ ప్రయత్నం.. వారిని కొనసాగిస్తారా, తప్పిస్తారా?

గంగాధర నెల్లూరు, పూతలపట్టు, సత్యవేడు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాలు కాగా, గంగాధర నెల్లూరు నుంచి ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి కుమార్తె కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రిపై స్థానికంగా వ్యతిరేకత ఎక్కువగా ఉండటంతో.. ఆయన తప్పుకుని కుమార్తెను పోటీకి పెట్టాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గంతో నారాయణస్వామికి చాలాకాలంగా పొసగడం లేదు. ప్రభుత్వ సలహాదారు జ్ఞానేందర్ రెడ్డితో నారాయణస్వామికి విభేదాలు ఉన్నాయి. నారాయణస్వామిని మరోసారి అంగీకరించేది లేదని జ్ఞానేందర్ రెడ్డి వర్గీయులు తెగేసి చెబుతున్నారు. దీంతో నారాయణ స్వామికి స్థానచలనం ఉండే అవకాశాలు లేకపోలేదు. గతంలో సత్యవేడు ఎమ్మెల్యేగా పనిచేసిన నారాయణస్వామికి అవసరమైతే అక్కడకు పంపాలనే ప్రతిపదన పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. లేదంటే తిరుపతి ఎంపీగానైనా పోటీ చేయిస్తారంటున్నారు. నారాయణస్వామి సత్యవేడు వస్తే సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పరిస్థితి ఏంటన్నది తెలియడం లేదు. ఈయన కూడా ప్రజావ్యతిరేకత ఎదుర్కొంటున్నట్లు సర్వేల్లో వెల్లడైందని అంటున్నారు.

Also Read: చంద్రబాబు, పవన్ భేటీపై అంబటి రాంబాబు ట్వీట్… స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన టీడీపీ నేత అయ్యన్న

ఇక పూతలపట్టు విషయంలోనూ మార్పు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. కొత్త వ్యక్తి ఇక్కడ తెరపైకి వస్తారని చెబుతున్నారు. మొత్తం మీద ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీల్లో ఎవరి సీటు గల్లంతు అవుతుందనేది హాట్‌టాపిక్‌గా మారింది.

ట్రెండింగ్ వార్తలు