Cow swayamvaram : ఆవుకు స్వయంవరం .. శుభలేఖ వేసి మరీ ప్రకటించిన యజమాని,చీఫ్ గెస్టులు, ప్రత్యేక విందు అదనపు ఆకర్షణ
తను పెంచుకునే ఆవుకు వివాహం చేయాలనుకున్నారు ఓ డాక్టర్. దానికోసం రాజుల కాలంలో స్వయంవరం ద్వారా వరుడ్ని ఎంపికకు శుభలేఖ వేయించారు. ఆసక్తికరంగా మారిన ‘గోమాత స్వయం వరం’ . ఈ వేడుకకు ముఖ్య అతిథులు..ప్రత్యేక విందు అదనపు ఆకర్షణగా ఉంది.

cow swayamvaram celebrations
Cow swayamvaram celebrations : పెంపుడు జంతువులకు వాటి యజమానులు శుభకార్యాలు చేయటం ట్రెండ్ గా మారింది. పెంపుకు కుక్కకు శ్రీమంతం..పిల్లికి పుట్టిన రోజు వేడుకలు వంటివి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ డాక్టర్ తను పెంచుకునే ఆవుకు వివాహం చేయాలనుకున్నాడు. దానికోసం రాజుల కాలంలో ఉండే స్వయంవరాన్ని ప్రకటించాడు. శుభలేఖ వేసి దాంట్లో ఆవు ఫోటో వేసి మరీ ప్రకటించాడు. ఇంతకీ ఏమా ‘గోమాత స్వయం వరం’ కథా కమామీషు ఏంటో చూసేద్దాం..
ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ సమీపంలోని రమణయ్యపేటలో గౌరీ శేఖర్ అనే వ్యక్తి ఓ ఆవును పెంచుకుంటున్నారు. ఆ ఆవు పేరు ‘సారణ’. తిరుమల ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్న గౌరీ శేఖర్ కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన భార్య రమాదేవి కూడా డాక్టరే. వారికి ఇద్దరు అమ్మాయిలు ఉన్నా సారణకు కంటికి రెప్పలాగ కన్నబిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటుంటారు డాక్టర్ దంపతులు. సారణ చిన్నప్పటినుంచే గౌరీ శేఖర్ కన్నబిడ్డలా చూసుకుంటు సారణకు బారసాల వేడుకను కూడా చేసి అచ్చంగా చంటిబిడ్డలకు చేసినట్లుగా ఊయల వేడుకను కూడా నిర్వహించిన స్థానికులను ఆశ్చర్యపరిచారు. అప్పట్లో ఆవుదూడకు బారసార వేడుక చేయటం వైరల్ గా మారింది.
తాజాగా అదే సారణ యుక్త వయస్సు వచ్చిందని స్వయంవరాన్ని ప్రకటించి మరోసారి డాక్టర్ గౌరీ శేఖర్ వైరల్ అవుతున్నారు. 21వ మాసంలోకి అడుగిడిన సారణకు వివాహ వయసు రావడంతో వైద్యులైన గౌరీశేఖర్, రమాదేవీ దంపతులు స్వయంవరం ప్రకటించారు. ఆదివారం (29,10.2023)ఉదయం 9గంటలకు నుంచి స్వయంవరం ప్రారంభం కానుంది అంటూ వివిధ ప్రాంతాలలోని నందీశ్వరులకు శుభలేఖను ఆహ్వానం పంపారు.
అంతేకాదు..ఈ మహోత్సవానికి ఓ ఫంక్షన్ హాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ హాలు వద్ద సారణను వరించేందుకు విచ్చేసిన నందీశ్వరుల వరుసలో ఉంచారు. దీంతో వరమాలతో సారణ తనకు నచ్చిన నందీశ్వరుడిని ఎంపిక చేసుకోనుందట. ఆ తరువాత ఇక వివాహం విందు కూడా ఉందంటు ప్రకటించారు డాక్టర్ దంపతులు. ఫంక్షన్ హాలులో వివాహ మహోత్సవానికి ప్రత్యేక మెనుని కూడా సిద్ధం చేయనున్నట్లుగా శుభలేఖలో పేర్కొన్నారు. సారణ కల్యాణ మహోత్సవానికి కంచి, తిరుపతి,తిరువణ్ణామలై నుంచి వచ్చేయుచున్న వేద పండితులచే శాస్త్రోక్తంగా, వైభవంగా వివాహం జరిపించబడును అంటూ శుభలేఖలో రాయించారు.
ఈ శుభలేఖకు గోఆధారిత వ్యవసాయంతో పండిన పంటలతో విందు భోజనం కూడా ఉంటుందని పేర్కొన్నారు. ఇట్లు ఆగమనాభిలాషలు డాక్టర్ రమాదేవి, డాక్టర్ గౌరీ శేఖర్ అని రాయించారు. వేదిక తిరుమల హాస్పిటల్ కాకినాడ అని శుభలేఖలో సారణ బుల్లిదూడతో కలిసి ఉన్న డాక్టర్ గౌరీ శేఖర్ ఫోటోలను శుభలేఖలో ముద్రించారు.