AP Legislative Council
AP Assembly Budget 2024: ఏపీ శాసన మండలి నుంచి వైసీపీ ఎమ్మెల్సీ వాకౌట్ చేశారు. బుధవారం శాసన మండలి సమావేశం ప్రారంభం కాగానే విజయనగరం జిల్లా గొర్ల మండలంలో డయేరియాపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ డిమాండ్ చేసింది. చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి వైసీపీ సభ్యులు నిరసన తెలిపారు. అనంతరం ప్రబుత్వం నుంచి సరియైన సమాధానం రాలేదని సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
శాసన మండలిలో డయేరియా మరణాలపై చర్చ సందర్భంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సమాధానమిచ్చారు. ఈ సమయంలో మండలి సభ్యులను హేళన చేసేలా మాట్లాడారంటూ వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డయేరియా మరణాలపై శాసనమండలి చర్చలో భాగంగా తొలుత వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆ తరువాత మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ.. డయేరియా పై సభ్యుల ఆవేదన చూసి ముచ్చట వేస్తోదంటూ పేర్కొనడంతోపాటు.. 15ఏళ్లలో ఎప్పుడూలేని మరణాలు వచ్చాయంటూ చిరునవ్వుతో మాట్లాడారని వైసీపీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రి వ్యాఖ్యలపై బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. మంత్రి వ్యక్తిగతంగా మాట్లాడటం మంచిది కాదని, ఆయనకు పైశాచిక ఆనందం ఉంటే ఉండొచ్చు.. కానీ, ప్రజలకు, సభలో సమాధానం చెప్పినప్పుడు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. అనంతరం మంత్రి వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయన క్షమాపణలు చెప్పాలని వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి డిమాండ్ చేశారు. అనంతరం వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.