AP Police : దేశంలోనే నెంబర్ 1 ఏపీ పోలీస్.. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో ఘనత సాధించింది. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

AP Police : దేశంలోనే నెంబర్ 1 ఏపీ పోలీస్.. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు

Ap Police

Updated On : March 10, 2022 / 5:11 PM IST

AP Police : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ మరో ఘనత సాధించింది. ప్రజలకు నాణ్యమైన భద్రత సేవలు అందించడంలో భారతదేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ పోలీస్ శాఖ రెండో స్థానంలో, గుజరాత్ పోలీస్ శాఖ మూడో స్థానంలో నిలిచాయి. 2021 సంవత్సరానికి గాను స్కోచ్ సంస్థ పోలీస్ మరియు భద్రత విభాగంలో వివిధ రాష్ట్రాల్లో పౌరులకు అందిస్తున్న సేవలపై అధ్యయనం నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ భారతదేశంలో మొదటి స్థానంలో ఉన్నట్లు గుర్తింపు నిచ్చింది.

పోలీస్ శాఖకు సంబంధించిన వివిధ అంశాల్లో నూతనంగా, ఆధునిక విధానాలను ఆవిష్కరిస్తూ వాటిని క్షేత్రస్థాయిలో ప్రజలకు చేరే విధంగా అవలంభి పారదర్శకమైన, వేగవంతమైన సేవలను అందిస్తున్నందుకుగాను 23 అవార్డులను పోలీస్ శాఖ కైవసం చేసుకుంది. రాష్ట్రంలోని వివిధ శాఖలకు సంబంధించిన సేవలకుగాను ఈ సంస్థ ప్రకటించిన 56 అవార్డుల్లో 23 అవార్డులు పోలీస్ శాఖకు రావడం విశేషం. 2020లో పోలీస్, భద్రత విభాగంలో ఏపీ పోలీస్ శాఖ మొదటి స్థానం దక్కించుకోగా ఈ సంవత్సరం కూడా మొదటి స్థానం నిలబెట్టుకుంది.

ప్రజా సమస్యల పట్ల క్షేత్రస్థాయిలో పోలీసు సిబ్బంది సకాలంలో స్పందిస్తూ వారి ఫిర్యాదుల పట్ల బాధ్యతతో వ్యవహరిస్తూ చట్టపరంగా అందించాల్సిన న్యాయాన్ని భాదితులకు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖకు లభిస్తున్న అవార్డులు ఇందుకు నిదర్శనం. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటూ దాని ద్వారా బాధితులకు రక్షణగా మేము ఉన్నాము అని పోలీసు శాఖ తెలిపింది. ప్రజలకు భరోసా కల్పిస్తూ వారికి దక్కాల్సిన న్యాయాన్ని అందిస్తూ భాదితుల మన్ననలను పొందుతూ దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాం అని తెలిపారు.