Actor Madhavan: ఏపీలోని గ్రామస్తులు చేసిన పనికి నటుడు మాధవన్ ఫిదా.. స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసలు.. వీడియో వైరల్
పునరుద్ధరణ ప్రయత్నం వెనకున్న చొరవ గురించి తెలుగు అబ్బాయి కాంత్ వివరాలను సోషల్ మీడియలో పంచుకున్నారు. పురాతన దేవాలయాలు, బావులు, వారసత్వ నిర్మాణాలను శుభ్రపరచడంపై దృష్టి పెట్టడానికి తాను పూర్వ సంపద రక్షక సేన అనే బృందాన్ని ఏర్పాటు చేశానని ఆయన వివరించారు.
Actor Madhavan Representative Image (Image Credit To Original Source)
- చెత్త, చెదారంతో నిండిపోయిన పురాతన ఆలయ బావి
- తెలుగు అబ్బాయి కాంత్ పిలుపుతో తరలివచ్చిన జనం
- గ్రామస్తులతో కలిసి బావిని శుభ్రం చేసిన వైనం
- పురాతన ఆలయాలను, వారసత్వ సంపదను పరిరక్షించుకోవాలని పిలుపు
- గ్రామస్తుల చర్య స్ఫూర్తిదాయకం అంటూ మాధవన్ ప్రశంసలు
Actor Madhavan: ఏపీలోని ఓ గ్రామ ప్రజలు చేసిన పని ప్రముఖ నటుడు మాధవన్ ను ఫిదా చేసింది. వారు చేసిన ప్రయత్నం, కృషిని మాధవన్ ప్రశంసలతో ముంచెత్తారు. అంతేకాదు వారి నుంచి తాను స్ఫూర్తిని పొందినట్లు తెలిపారు. వారి వీడియోని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ కూడా చేశారు. అసలు ఏపీలోని ఆ గ్రామ ప్రజలు ఏం చేశారు? వారిని మాధవన్ ఎందుకు ప్రశంసించారు? వారి నుంచి ఆయన ఎలాంటి స్ఫూర్తిని పొందారు? తెలుసుకుందాం..
అదో పురాతన ఆలయం. 500 ఏళ్ల క్రితం నాటి ఆలయం. అందులో ఒక బావి ఉంది. అది చెత్తతో నిండిపోయింది. శిథిలావస్థకు చేరింది. అలాంటి ఆలయ బావి ఇప్పుడు కొత్త రూపు దిద్దుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది నటుడు ఆర్ మాధవన్ ను కూడా కదిలించింది. ఆ వైరల్ వీడియోను ఆయన షేర్ చేశారు. సమాజ చర్య వారసత్వ నిర్మాణాలను ఎలా పునరుద్ధరించగలదో చూపిస్తుందని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లోని 500 సంవత్సరాల పురాతన ఆలయ బావి పునరుద్ధరణ అద్భుతం అని కొనియాడారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలోని ఇటిక్యాల గ్రామంలో ఉన్న 500 సంవత్సరాల పురాతన ఆలయ బావి వీడియోను తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేశారు మాధవన్. కంటెంట్ క్రియేటర్, తెలుగు అబ్బాయి కాంత్.. సంవత్సరాలుగా నిర్లక్ష్యం చేయబడిన ఆ చరిత్రాత్మక బావిని ఎలా పునరుద్ధరించారో తెలుపుతూ డాక్యుమెంట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చెత్తతో నిండిపోయిన ఆలయ బావిని క్లీన్ చేసేందుకు ముందుకు రావాలని కాంత్ స్థానికులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు. అంతే.. ఆయన పిలుపునకు అనూహ్యమైన స్పందన వచ్చింది. గ్రామస్తులు తరలి వచ్చారు. బావిని శుభ్రం చేసే పని ప్రారంభించారు. అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పేరుకుపోయిన చెత్తను, శిథిలాలను తొలగించారు. అలా కొన్ని రోజుల్లోనే ఆ బావిని అందంగా తీర్చిదిద్దారు. ఇప్పుడా వారసత్వ ప్రదేశం స్థానిక సమాజానికి గర్వకారణంగా మారింది.
పునరుద్ధరణ ప్రయత్నం వెనకున్న చొరవ గురించి తెలుగు అబ్బాయి కాంత్ వివరాలను సోషల్ మీడియలో పంచుకున్నారు. పురాతన దేవాలయాలు, బావులు, వారసత్వ నిర్మాణాలను శుభ్రపరచడంపై దృష్టి పెట్టడానికి తాను పూర్వ సంపద రక్షక సేన అనే బృందాన్ని ఏర్పాటు చేశానని ఆయన వివరించారు. తరచుగా నిర్లక్ష్యం చేయబడి వ్యర్థాలతో నిండిపోయే పురాతన దేవాలయాలు, బావులు, వారసత్వ కట్టడాలను శుభ్రపరచడంపై దృష్టి సారించానని ఆయన వివరించారు. కాంత్ బృందంలో ప్రస్తుతం దాదాపు 40 మంది సభ్యులు ఉన్నారు. వారు పునరుద్ధరణ పనులను నిర్వహించడానికి వివిధ ప్రదేశాలకు ప్రయాణిస్తారు. తరచుగా వాహనాలను అద్దెకు తీసుకుంటారు. రవాణ, భోజనాలకు సంబంధించిన ఖర్చులను నిర్వహిస్తారు.
నిర్లక్ష్యం, చెత్త పేరుకుపోవడం వల్ల శిథిలమవుతున్న చారిత్రక భవనాలను పునరుద్ధరించడమే ఈ బృందం లక్ష్యమని కాంత్ తెలిపారు. పురాతన నిర్మాణాలు.. మన సాంస్కృతిక సంప్రదాయాలు, విలువలకు పునాది అని నొక్కి చెప్పారు. వారసత్వ ప్రదేశాలను పరిరక్షించుకోవడం మనందరి బాధ్యత అని కాంత్ స్పష్టం చేశారు. మీ ఊరిలోనూ ఇలానే చెత్తతో పేరుకుపోయిన, శిథిలావస్థకు చేరుకున్న పురాతన ఆలయాలను శుభ్రం చేయడంతో పాటు పరిరక్షించుకోవాలని కాంత్ పిలుపునిచ్చారు.
ఈ ప్రయత్నం సోషల్ మీడియా లో త్వరగానే అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక, నటుడు మాధవన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వీడియోను షేర్ చేయడం ద్వారా ఈ చొరవ మరింత విస్తృతమైంది. అభిమానులు, ప్రముఖుల నుండి ప్రశంసలు అందుకుంది. నటి శ్రియ శరణ్.. పునరుద్ధరణ పనిని ప్రశంసించారు. గ్రామ ప్రజలు, వాలంటీర్ల అంకితభావాన్ని నెటిజన్లు పొగుడుతున్నారు. ఈ బృందాన్ని నిజమైన ప్రభావశీలులుగా అభివర్ణించారు. వారి ప్రయత్నాన్ని స్ఫూర్తిదాయకంగా పేర్కొన్నారు. వారసత్వ ప్రదేశాల చుట్టూ పరిశుభ్రతను కాపాడుకోవడం మన కర్తవ్యం అంటున్నారు. అనుకుంటే అసాధ్యం కానిది ఏదీ లేదని, వీరి సంకల్పం చాలా గొప్పదని నెటిజన్లు కీర్తిస్తున్నారు. వారి ప్రయత్నం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందన్నారు. ఇదే విధంగా అందరూ స్పందిస్తే, ముందుకు వస్తే పురాతన ఆలయాలను పరిరక్షించుకోవడం కష్టమేమీ కాదంటున్నారు.
View this post on Instagram
