Andhrapradesh assembly session
AndhraPradesh assembly session: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన ప్రజాప్రతినిధులకు సంతాపం తెలిపారు. సభ ప్రారంభమైన కొద్దిసేపటికే తీవ్ర గందరగోళం నెలకొంది. నిరుద్యోగ సమస్య వాయిదా తీర్మానంపై చర్చించాలని టీడీసీ సభ్యులు పట్టుబట్టారు. రాష్ట్రంలో ఉద్యోగాలు లేక యువత నానా ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. దీంతో టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. సభను అడ్డుకోవాలని టీడీపీ సభ్యులు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. సభలోకి ప్లకార్డులు తీసుకురావడం సరికాదని చెప్పారు. అసెంబ్లీ నిర్వహించాలని డిమాండ్ చేసిన టీడీపీ సభ్యులే ఇప్పుడు సభను అడ్డుకుంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సభా సమయాన్ని వృథా చేస్తున్నారని, ప్రశ్నోత్తరాలు జరగకుండా అడ్డుకుంటోందని అన్నారు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. టీడీపీ సభ్యులు రాజకీయ నిరుద్యోగులుగా మారారని జోగి రమేశ్ అన్నారు. టీడీపీ వాయిదా తీర్మానాలను స్పీకర్ తిరస్కరించారు.