CM Chandrababu Naidu - TDP
New Scheme: కూటమి ప్రభుత్వం ఇప్పటికే పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది. అన్ని వర్గాల వారికి ఆర్థిక సాయం అందిస్తోంది. తాజాగా మరో కొత్త పథకానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఈ స్కీమ్ తెస్తోంది. అదే ఆటో డ్రైవర్ సేవలో(వాహనమిత్ర). ఈ స్కీమ్ ని సీఎం చంద్రబాబు రేపు ప్రారంభించనున్నారు. ఈ పథకం కింద ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఏడాదికి 15 వేల రూపాయలు ఇవ్వనుంది ప్రభుత్వం.
2 లక్షల 90వేల మందిని అర్హులుగా గుర్తించింది. ఇందుకోసం 436 కోట్ల రూపాయలు కేటాయించింది ప్రభుత్వం. సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ కలిగిన డ్రైవర్లకు ఈ పథకం వర్తిస్తుంది. రేపు విజయవాడలో ఈ స్కీమ్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నిధులను నేరుగా లబ్దిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నారు.
ఈ స్కీమ్ ను ప్రారంభించే తేదీ, టైమ్ ని ఇదివరకే సీఎం చంద్రబాబు ప్రకటించారు. అక్టోబర్ 4వ తేదీన పథకాన్ని ప్రారంభిస్తామన్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆదుకుంటామన్నారు. పెండింగ్ చలాన్లు, ఫిట్ నెస్ సర్టిఫికెట్ క్లియర్ చేసుకున్న వారికి ఆర్థిక సాయం అందుతుందని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఆటో, క్యాబ్ (మ్యాక్సీ, మోటార్) డ్రైవర్లకు ఆటో డ్రైవర్ సేవలో స్కీమ్ ను వర్తింప చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వం రూ.10 వేలు మాత్రమే ఇచ్చేది.. మేము రూ.15వేలు ఇస్తున్నామన్నారు.
రాష్ట్రంలో మహిళల కోసం ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే స్త్రీ శక్తి పథకాన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని వల్ల తమకు నష్టం వస్తోందని ఆటో, క్యాబ్ డ్రైవర్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఈ అంశంపై స్పందించిన సీఎం చంద్రబాబు అనంతపురంలో జరిగిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతీ ఏటా రూ.15వేలు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. ఈ పథకం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై రూ.400 కోట్లకు పైగానే భారం పడుతుందన్నారు. అర్హత ఉన్నా ఏవైనా కారణాలతో లబ్దిదారుల జాబితాలో పేరు లేకపోతే.. వారి సమస్యను పరిష్కరించి వారినీ లబ్దిదారుల జాబితాలో చేరుస్తామని సీఎం చంద్రబాబు ఇటీవల స్పష్టం చేశారు. లబ్ధిదారులు తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్‌లో చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలి.
గత వైసీపీ ప్రభుత్వం హయాంలో వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం కింద అర్హులైన ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ప్రతి ఏటా ఆర్థిక సాయం అందించింది. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ పథకాన్ని ఆటో డ్రైవర్ సేవలో అని మార్చి.. ప్రతీ సంవత్సరం ఆటో, క్యాబ్ డ్రైవర్లకు రూ.15వేలు చెల్లించనుంది.
Also Read: తోపుదుర్తి వర్సెస్ కేతిరెడ్డి.. ధర్మవరంలో రాప్తాడు రాజకీయం.. ఇందుకేనా.?