AP 10th Class Results
AP SSC Results: ఏపీలో టెన్త్ ఫలితాలు వచ్చేశాయి. మంత్రి నారా లోకేశ్ ఆన్ లైన్ లో ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జరిగిన పరీక్షలకు మొత్తం 6,14,459 మంది విద్యార్థులు హాజరుకాగా.. వీరిలో 4,98,585 మంది విద్యార్థులు (81.14శాతం) ఉత్తీర్ణత సాధించారు. వీరిలో బాలురు 78.31శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలికలు 84.09శాతం ఉత్తీర్ణత సాధించారు.
రాష్ట్రంలోని 1,680 పాఠశాలల్లో వందశాతం ఫలితాలురాగా.. 19పాఠశాలల్లో ఎవ్వరూ పాస్ కాలేదు. అందులో తొమ్మిది ప్రైవేట్ పాఠశాలలు, 10 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 65.36శాతం మంది విద్యార్థులు ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించగా.. 10.69శాతం మంది విద్యార్థులు సెకండ్ క్లాస్ లో, 5.09శాతం మంది విద్యార్థులు థర్డ్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాలు విడుదల చేసిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ.. పదో తరగతి ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు నిరుత్సాహపడొద్దని సూచించారు. మే 19వ తేదీ నుంచి 28వ తేదీ వరకు టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రేపటి నుంచి (ఈనెల 24) నుంచి 30వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు. ఆ తరువాత రూ.50 లేట్ ఫీజుతో మే18వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంది.