AP Budget 2025 allocations for Women
AP Budget 2025 : ఏపీ మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈసారి వార్షిక బడ్జెట్‌లో మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేసింది. బడ్జెట్‌లో మహిళల కోసం భారీగా కేటాయింపులు ఇచ్చింది. ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు.
ఈ ఏడాది మొత్తంగా రూ.3,22,359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మహిళల కోసం అనేక పథకాలకు భారీగా నిధులను కేటాయించారు. అందులో ప్రధానంగా తల్లికి వందనం పథకం, మహిళా సంక్షేమ పథకం, దీపం 2.0 వంటి పథకాలకు భారీగా కేటాయింపులు అందాయి.
Read Also : AP Budget 2025 : ఏపీ ప్రజలకు కొత్త పథకం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఎప్పటినుంచంటే?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సూపర్ సిక్స్ హామీలైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. బడ్జెట్‌లోనూ ఇదే ప్రస్తావించింది. ఏపీలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్న తల్లికి వందనం పథకంలో భారీగా నిధులను కేటాయించింది.
తల్లికి వందనం కింద రూ. రూ.9,407 కోట్లు :
గత ప్రభుత్వం అమ్మ ఒడి పథకం పేరుతో అమలు చేయగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసి తల్లికి వందనం పేరుతో అమలు చేయనుంది. అప్పట్లో రూ. 12 వేలు ఇచ్చే వాళ్లు కాగా, ఇప్పుడు ఆ మొత్తాన్ని రూ. 15వేలకు పెంచింది.
గతంలో ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉన్నా ఒక్కరికే పథకం అమలు అయ్యేది. కానీ, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఎంతమంది చదివినా అందరికీ ఈ పథకం వర్తించనుంది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో ఏకంగా రూ.9,407 కోట్లను కేటాయించింది.
స్కూల్‌కు వెళ్లే విద్యార్థుల కోసం ఈ పథకాన్ని అందించనున్నారు. వచ్చే మేలో తొలి విడత నిధులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. చదివే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకం కింద కేటాయించిన నిధులు అందనున్నాయి.
వీరికి మాత్రమే వర్తింపు :
ఈ పథకం ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలోని 1 వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదువుతున్న చిన్నారులకు వర్తిస్తుంది. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు అందనున్నాయి. విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను ప్రభుత్వం త్వరలో జమ చేయనుంది.
మహిళా సంక్షేమం, దీపం 2.0 కేటాయింపులివే :
స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అదేవిధంగా, మహిళా శిశు సంక్షేమం కోసం రూ.4,332 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో మహిళలు, పిల్లల సంక్షేమ అభివృద్ధి కోసం ఈ నిధులను కేటాయిస్తారు.
ఈ లక్ష్యాలను చేరుకునేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్ధిదారులకు వివిధ సేవలను అందిస్తారు. ఇందులో గర్భిణీలు, బాలింతలకు, పుట్టిన పిల్లలకు సంబంధించి అన్ని సేవలను అందిస్తారు. దీపం 2.0 (గ్యాస్ సిలెండర్లు) పథకం కోసం రూ.2,601 కోట్లు కేటాయించింది.