AP Budget 2025 : ఏపీ ప్రజలకు కొత్త పథకం.. పేద, మధ్యతరగతి కుటుంబాలకు రూ.25 లక్షల ఆరోగ్య బీమా.. ఎప్పటినుంచంటే?
AP Budget 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఏటా రూ. 25 లక్షల వరకు ఆరోగ్య బీమా పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ ఎప్పటినుంచి అమల్లోకి రానుందంటే?

Andhra Pradesh govt nod to launch
AP Budget 2025 : రాష్ట్రంలో పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా ఏపీ కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ప్రస్తుత బడ్జెట్ 2025లో ప్రజా సంక్షేమానికే పెద్ద పీట వేసింది. రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి కొండంత అండగా నిలుస్తోంది. ఏపీ ప్రజల కోసం సరికొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొస్తోంది. నాణ్యమైన వైద్య సేవలను అందించేందుకు ఈ ఆరోగ్య బీమా పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.
Read Also : Govt Old Age Homes : ఏపీలోని వృద్ధులకు తీపికబురు.. వృద్ధుల సంరక్షణ కోసం కొత్తగా 12 వృద్ధాశ్రామాలు!
ఈ మేరకు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రకటించారు. రాష్ట్రంలో ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల బీమా సౌకర్యాన్ని తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. ఈ ఆరోగ్య బీమా పథకం ఈ ఏడాది నుంచి అమలులోకి రానుందని వెల్లడించారు. ఇందుకోసం ఆరోగ్యశాఖకు రూ.19,264 కోట్లను బడ్జెట్లో కేటాయించారు.
మధ్యతరగతి, పేద ప్రజలకు ఎలాంటి ఖర్చు లేకుండా కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్ ప్రసంగంలో ఆయన పేర్కొన్నారు. రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమాను అందించనున్నట్టు తెలిపారు.
ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే.. ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు మంత్రి పయ్యావుల స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉండగా.. అంతకన్నా మెరుగైనా వైద్య సేవలను అందించనుందా? అనేది తెలియాల్సి ఉంది. ఈ కొత్త ఇన్సూరెన్స్ స్కీమ్ అమలుకు సంబంధించి నియమ నిబంధనలపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దాంతో ఎవరెవరు ఇందుకు అర్హులు అనేది స్పష్టత లేదు.
ప్రస్తుత రోజుల్లో ఆస్పత్రుల ఖర్చులు భారంగా మారిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఈ కొత్త ఇన్సూరెన్స్ సామాన్య, మధ్యతరగతి వారిలో వైద్య ఖర్చుల భారాన్ని తగ్గించనుంది. మెరుగైన ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నిలుస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి కొత్త నిబంధనలు విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు.