సూపర్ సిక్స్ హామీలపై చంద్రబాబు జెట్ స్పీడ్‌

క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు.

జనాలకు మాట ఇచ్చాం. ఆ మాట ప్రకారం కమిట్‌మెంట్‌తో పనిచేయాల్సిందే. హామీలను నమ్మి ప్రజలు పట్టం కట్టారు. అధికారాన్ని నిలబెట్టుకుంటూనే హామీలను అమలు చేయాలని పట్టుదలతో ఉన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గతంలోనూ సీఎంగా బాధ్యతలు నిర్వహించిన చంద్రబాబు..ఈ సారి వచ్చిన అధికారాన్ని మాత్రం లైట్ తీసుకోవడం లేదు. ఎలాగోలా అధికారం వచ్చింది.. గడిచిపోతుంది అన్నట్లుగా కాకుండా..ఏడు పదుల వయస్సులోనూ ఓపికతో, పట్టుదలతో పనిచేస్తున్నారు.

ఈ సారి ప్రజలు ఇచ్చిన అధికారాన్ని పెద్ద బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. అందుకే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను చెప్పినట్లుగా అమలు చేసేందుకు జెట్ స్పీడ్‌తో నిర్ణయాలు తీసుకుంటున్నారు. క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు..

కేబినెట్‌ తీర్మానాల్లో మొదటిది మెగా డీఎస్సీ.. మొత్తం 16వేల 347 పోస్టుల భర్తీ చేయనున్నారు. ఆ తరువాత ల్యాండ్ టైటిలింగ్‌ చట్టం రద్దు, ఏప్రిల్‌ నుంచి పెన్షన్ రూ.4 వేలకు పెంపు, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన అంశాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొత్తగా టెట్‌ నిర్వహించాలా లేదంటే టెట్‌తో సంబంధం లేకుండా డీఎస్సీ నిర్వహించాలా వంటి ప్రతిపాదనలపై చర్చించారు.

డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు క్యాబినెట్‌ ముందుంచారు. జులై ఒకటి నుంచి డీఎస్సీ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్‌ 10లోపు 16వేల 347 పోస్టులను భర్తీ చేసేలా ప్రణాళికను రూపొందించారు. ఇక విజయవాడలోని వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ పేరు NTR హెల్త్ వర్సిటీగా మారుస్తూ కేబినెట్ ఆమోదం తెలిపింది.

పెన్షన్ల పెంపు
పెన్షన్ల పెంపుపై మంత్రివర్గంలో చర్చించారు. ప్రస్తుతం ఇస్తున్న రూ.3 వేల పెన్షన్‌ను రూ.4వేలకు పెంచే నిర్ణయానికి ఆమోదం తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు జులై ఫస్ట్ నుంచి గత మూడునెలలకు కలిపి వచ్చే నెలలో ఒక్కొక్కరికి రూ.7వేల పెన్షన్ అందనుంది. 65 లక్షల మందికి ఇంటి దగ్గరే రూ.7వేల పెన్షన్ తీసుకోనున్నారు. ఆ తర్వాత ఆగస్ట్ 1 నుంచి మాత్రం యథావిధిగా నెలకు రూ.4వేలు పెన్షన్ వస్తుంది. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లే.. ఇంటికి తీసుకెళ్లి అందజేయాలని నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వనుంది చంద్రబాబు సర్కార్.

మూడున్నర గంటల పాటు జరిగిన క్యాబినెట్ సమావేశంలో కీలక అంశాలపై డిస్కస్ చేశారు. హామీల అమలుపై మూడు పేజీల నోట్‌ను తయారు చేశారు చంద్రబాబు. సూపర్ సిక్స్ పథకాల అమలుకు కావాల్సిన బడ్జెట్‌ రూపకల్పనపైనా చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే పోలవరం ప్రాజెక్టు, అమరావతి రాజధానిలో పర్యటించిన బాబు.. సంక్షేమ పథకాలతో పాటు అమరావతి, పోలవరంకు కావాల్సిన నిధులపై కూడా ఫోకస్ చేశారు.

నిధుల సమీకరణపై ఇప్పటికే అధికారులతో డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది. జులై నెలాఖరులోగా పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో.. కొత్త బడ్జెట్‌ తయారీలో ప్రాధాన్యత అంశాలపైనా బాబు ఆలోచిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్లపైనా వివరాలు తెప్పిస్తున్నారు.

గంజాయిపై..
రాష్ట్రంలో గంజాయి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సబ్ కమిటీ వేశారు సీఎం చంద్రబాబు. హోం మంత్రి అనిత ఆధ్వర్యంలో సబ్ కమిటీ పనిచేయనుంది. ఐదుగురు మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. త్వరలో ఆరు శ్వేత పత్రాలు విడుదల చేయాలని క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నారు. పోలవరం, అమరావతి, లిక్కర్, మైనింగ్, ఫైనాన్స్, విద్యుత్ శాఖలపై శ్వేతపత్రాలు విడుదల చేయాలని డిసైడ్ చేశారు.

క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు చంద్రబాబు. ఏ మంత్రి ఎలా ఉండాలి..ఎలా వ్యవహరించాలనే దానిపై సూచనలు చేశారు. రాత్రి 7 గంటల తర్వాత సమీక్షలు అవసరం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. శాఖల వారీగా ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చించారు. శ్వేతపత్రాల విడుదలపై మంత్రులకు సూచనలు చేశారు. శాఖలపై పట్టు సాధించాలని సూచించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ శాఖలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు సీఎం.

Also Read: ‘పూర్తిగా రద్దు చేయండి’ అంటూ దేశంలో జరుగుతోన్న ఈ గందరగోళంపై మోదీకి మమతా బెనర్జీ లేఖ

ట్రెండింగ్ వార్తలు