ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు అయిపోయింది. పాలన పరుగులు పెడుతోంది. కానీ అక్కడక్కడ మంత్రుల తీరుపై అసంతృప్తులు వ్యక్తం అవుతున్నాయట. ఒకరిద్దరు మంత్రుల పనితీరుపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఈ నేపథ్యంలోనే సర్కార్ ఏర్పాటై ఇంకా ఏడాది కూడా దాటకముందే సీఎం చంద్రబాబు తన క్యాబినెట్‌లోని ఇద్దరు మంత్రులకు ఉద్వాసన పలకబోతున్నారని ప్రచారం జరుగుతోంది.
మంత్రిగా ఎవరెవరి పనితీరు ఎలా ఉంది..పనిచేయని మంత్రులెవరని రిపోర్ట్ తెప్పించుకున్నారట సీఎం చంద్రబాబు. ఆ నివేదిక ఆధారంగా సరిగ్గా పనిచేయని ఓ ఇద్దరు మంత్రులపై వేటు పడే చాన్స్ ఉందని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో 24 మంది మంత్రులు ఉన్నారు. ప్రస్తుతానికైతే ఒక్క మంత్రికి మాత్రమే మంత్రివర్గంలో చోటు కల్పించే చాన్స్ ఉంది. ఆ బెర్తును మెగా బ్రదర్ నాగబాబుతో భర్తీ చేయాలని ఫిలప్ చేయాలని డిసైడ్ అయ్యారు.
నాగబాబును క్యాబినెట్‌లోకి తీసుకోబోతున్నట్లు..రాజ్యసభ సభ్యుల ఎంపిక సమయంలోనే క్లారిటీ ఇచ్చారు సీఎం చంద్రబాబు. అయితే ఇప్పటికే పలువురు మంత్రుల తీరు సరిగ్గా లేదని భావిస్తోన్న ముఖ్యమంత్రి..వాళ్లను తప్పించి కొత్తవాళ్లను తీసుకుంటే ఎలా ఉంటుందనే ఆలోచనకు వచ్చారట.
మంత్రులు ఎవరనే దానిపై ఉత్కంఠ
క్యాబినెట్‌లో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఉద్వాసన పలుకుతారని పార్టీ పెద్దలు చెప్తుండటంతో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా షాక్ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం ఏడాది కూడా పూర్తవక ముందే మంత్రులకు ఉద్వాసన పలకడం ఏంటీ.. క్యాబినెట్ నుంచి ఔట్ అయ్యే మంత్రులు ఎవరనే దానిపై ఉత్కంఠ కంటిన్యూ అవుతోంది. కోనసీమ జిల్లా నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి అయిన ఓ అమాత్యుడిపై వేటు తప్పదన్న టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్సీ ఓట్ల నమోదులో అలసత్వం వహించారంటూ ఇప్పటికే సదరు అమాత్యడిపై సీఎం చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఉత్తరాంధ్రకు చెందిన ఇంకో మంత్రికి కూడా ఉద్వాసన ఖాయమన్న ప్రచారం జోరందుకుంది. ఆ ఇద్దరే కాకుండా మరో ఇద్దరు మంత్రులను కూడా సాగనంపే అవకాశాలు ఉన్నాయని తెలుగు తమ్ముళ్లు గుసగుసలు పెట్టుకుంటున్నారు.
జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమైంది. జనవరి 8 లేదా 9న నాగబాబుతో పాటు మరో ఇద్దరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారని అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రాసెస్, ఏర్పాట్లు కూడా జరుగుతున్న టాక్. నాగబాబుకు మంత్రి పదవి ఇస్తే..జనసేన మంత్రుల సంఖ్య నాలుగుకు చేరుతుంది.
నాగబాబుకి సినిమాటోగ్రఫీ శాఖ?
బీజేపీకి మాత్రం కేవలం ఒక్క మంత్రి పదవి మాత్రమే ఉంది. అయితే జనసేనకు చెందిన ఓ మంత్రిని తప్పించి..బీజేపీలోని ఓ ఎమ్మెల్యేకు మంత్రిగా ప్రమోషన్ ఇవ్వాలని యోచిస్తున్నారని చెబుతున్నారు. త్వరలోనే మంత్రిగా నాగబాబు ప్రమాణం చేయగానే సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారని అని కూడా అంటున్నారు. ప్రస్తుతం ఈ శాఖ జనసేన మంత్రి కందుల దుర్గేష్ దగ్గర ఉండటంతో నాగబాబుకు బదిలీ చేస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఏపీ టీడీపీ అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు క్యాబినెట్ బెర్త్ ఖాయమనే మాట వైరల్‌గా మారింది. ఇంకో బెర్తు బీజేపీ ఎమ్మెల్యేల్లో ఎవరికో ఒకరికి ఇస్తారని చర్చ జరుగుతోంది. మొత్తానికి కొత్త ఏడాదిలో మంత్రివర్గంలోకి ఇద్దరు కొత్తవారిని తీసుకుంటే..ఇద్దరు జూనియర్స్‌కు చంద్రబాబు ఉద్వాసన పలకడం ఖాయమన్న ప్రచారం ఊపందుకుంది. అయితే క్యాబినెట్ నుంచి తప్పించే ఆ ఇద్దరికి పార్టీలో కీలక బాధ్యతలు ఇస్తారని అంటున్నారు టీడీపీ నేతలు. సో క్యాబినెట్ షఫ్లింగ్ అనేది ఉట్టి ప్రచారమేనా..లేక కన్ఫామేనా అనేది..మరో వారం రోజల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.