భర్త మరణం : నడిరోడ్డుపై దిక్కుతోచని మహిళను స్వయంగా ఇంటికి చేర్చిన పోలీసు అధికారి

AP CI helped woman to reach her home mid night : అర్థరాత్రి నడిరోడ్డుపై ఇద్దరు పిల్లలతో బిక్కు బిక్కుమంటూ నిల్చుందో మహిళ. ఆమెను చూసి పోలీసులు ఏంచేశారో తెలిస్తే ‘హ్యాట్సాఫ్’ చెప్పకుండా ఉండలేం. పనిమీద బైటకెళ్లిన భర్తకు యాక్సిడెంట్ అయి ప్రాణాలు కోల్పోయాడని తెలిసిన ఆ భార్య బాధతో కన్నీరుమున్నీరుగా ఏడ్చింది.
ఇద్దరు బిడ్డలతో కలిసి భర్తను చూడటానికి వెళ్లాలని రోడ్డుమీదకొచ్చింది. కానీ ఏ వాహనం కూడా ఆమెకు దొరకలేదు.దీంతో ఏంచేయాలో తెలీక దిక్కుతోచకుండా బిక్కుబిక్కుమంటూ నిల్చున్న ఆమెకు మేం ఉన్నామంటూ వచ్చారు పోలీసు అధికారి..ఆమెను దగ్గరుండి తన కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించిన ఘటన ఏపీలో జరిగింది.
ఏపీలోని కృష్ణాజిల్లా ఘంటసాల మండలంలోని లంకపల్లి గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదేసమయంలో వేగంగా వచ్చిన ఓ వాహనం అతడిని ఢీ కొట్టంతో తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి అతడిని మచిలీపట్నం ప్రభుత్వాస్పత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు.
శ్రీనివాసరావు మరణవార్తను స్థానికులు కుటుంబ సభ్యులకు చేరవేశారు. కానీ అప్పటికే శ్రీనివాసరావు భార్య సుభాషిణి కుటుంబ కలహాలతో గత కొంతకాలంగా గుడివాడలోని తన పుట్టింట్లోనే ఉంటోంది. ఈక్రమంలో భర్త వెంకటేశ్వరరావు భర్త మరణవార్త తెలుసుకున్న సుభాషిణి లంకపల్లి బయలుదేరింది.
రాత్రి 11గం.ల సమయంలో చల్లపల్లికి చేరుకుంది. కానీ అక్కడనుంచి గ్రామానికి వెళ్లేందుకు ఎటువంటి వాహనాలు అందుబాటులో లేకపోవటంతో తన ఇద్దరు పిల్లలతో కలిసి బిక్కుబిక్కు మంటూ రోడ్డుపక్కనే కూర్చుంది. ఓ పక్క భర్త చనిపోయాడనే వార్త. మరోపక్క భర్త మృతదేహం దగ్గరకు చేరుకోలేని దుస్థితి.
ఆ దుస్థితిలో ఉన్న సుభాషిణిని రాత్రి పెట్రోలింగ్ నిర్వహిస్తున్న చల్లపల్లి సీఐ వెంకట నారాయణ గమనించారు. దగ్గరకు వెళ్లి విషయం తెలుసుకున్నారు. సుభాషిని పరిస్థితికి ఆయన చలించిపోయారు. భయపడవద్దని ధైర్యం చెప్పి స్వయంగా తన కారులో లంకపల్లిలోని వెంటేశ్వరరావు ఇంటికి తీసుకెళ్లి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఖాకీ డ్రెస్ వేసుకున్న ప్రతీవారు కర్కోటకులు కాదు ఖాకీ డ్రెస్ వెనుక దయగల హృదయం కూడా ఉందని సీఐ వెంకట నారాయణలాంటివాళ్లు నిరూపిస్తున్నారు.