Buddha Venkanna : టీడీపీ కీలక నేతకు సీఐడీ నోటీసులు.. హైదరాబాద్ వెళ్లి మరీ

హైకోర్టు ఆదేశాలను అనుసరించి నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్ కు రాగా, ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేశారు. Buddha Venkanna

CID Notices To Buddha Venkanna

CID Notices To Buddha Venkanna : టీడీపీ నేత బుద్ధా వెంకన్నకు సీఐడీ నోటీసులు అందజేసింది. చంద్రబాబు రిమాండ్ కు వ్యతిరేకంగా జడ్జిపై బుద్ధా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై హైకోర్టు ఆదేశాలను అనుసరించి బుద్దా వెంకన్నకు నోటీసులు ఇచ్చామని సీఐడీ అధికారులు తెలిపారు. వైద్య పరీక్షల కోసం బుద్ధా వెంకన్న హైదరాబాద్ కు రాగా, ఆయనకు నోటీసులు సర్వ్ చేశారు. అభియోగాలపై వెంటనే వివరణ ఇవ్వాలని నోటీసుల్లో స్పష్టం చేసినట్టు తెలిపారు.

ప్రతిపక్ష నాయకులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ సీఐడీ 6 కేసులు పెట్టింది. పలువురు టీడీపీ నేతలపైనా కేసులు నమోదు చేసింది. కేసులు నమోదు చేయడమే కాదు.. వారు ఎక్కడున్నా అక్కడికెళ్లి మరీ నోటీసులు ఇస్తోంది సీఐడీ. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసుకు సంబంధించి సీఐడీ ఇలానే వ్యవహరించింది. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు ఢిల్లీ వెళ్లి మరీ సీఐడీ అధికారులు నోటీసులు అందించిన సంగతి తెలిసిందే.

Also Read : చంద్రబాబుపై మరో కేసు.. ఏ-2గా చేర్చిన సీఐడీ

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై జడ్జిలపై బుద్దా వెంకన్న అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో బుద్దా వెంకన్నకు నోటీసులు ఇచ్చారు. విజయవాడ నుంచి వెళ్లి హైదరాబాద్‌లో ఉన్న బుద్దా వెంకన్నను కలిసి మరీ నోటీసులు అందజేశారు.

సీఐడీ తీరుపై టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు. వారి వైఖరిని తప్పుబడుతున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా సీఐడీ అధికారులు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై కక్ష కట్టారని.. సీఐడీని అడ్డం పెట్టుకుని అక్రమంగా కేసులు బనాయించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ఉచితంగా ఇసుక ఇచ్చిన చంద్రబాబుపై కేసా? 40వేల కోట్లు దోచిన మీపై ఎన్ని కేసులు పెట్టాలి?- సీఎం జగన్‌పై అచ్చెన్నాయుడు ఫైర్

అటు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును కేసులు వెంటాడుతున్నాయి. చంద్రబాబుపై మరో కేసు నమోదైంది. టీడీపీ హయాంలో ఇసుక అక్రమాలపై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. ఉచిత ఇసుక పాలసీలో అవకతవకలు జరిగాయంటూ ఏపీఎండీసీ డైరెక్టర్‌ వెంకటరెడ్డి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగేలా వ్యవహరించారంటూ వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ఏ-1గా పీతల సుజాత, ఏ-2గా చంద్రబాబు, ఏ-3గా చింతమనేని ప్రభాకర్‌, ఏ-4గా దేవినేని ఉమను చేర్చారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ లో చంద్రబాబు సెప్టెంబర్ 9 అరెస్ట్ అయ్యారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 52 రోజుల పాటు ఉన్న చంద్రబాబు.. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో విడుదలయ్యారు.

మొత్తం 6 కేసులు నమోదు..
చంద్రబాబుపై తాజాగా ఇసుక అక్రమాల కేసుతో కలిపి ఇప్పటికి ఆరు కేసులు నమోదయ్యాయి. స్కిల్ డెవలప్ మెంట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్ అంశాల్లో సీఐడీ, అంగళ్లు ఘర్షణపై పోలీసులు కేసులు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మద్యం కేసు, ఇప్పుడు ఇసుక అక్రమాల కేసు నమోదైంది.