AP CM Jagan
CM Jagan Kakinada public meeting : ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం కాకినాడలో పర్యటించారు. నగరంలో రూ. 94కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను వర్చువల్ విధానం ద్వారా జగన్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎంసీ గ్రౌండ్స్ లో జరిగిన సభలో జగన్ పాల్గొని వైఎస్సార్ పింఛన్ కానుక రూ.3వేలకు పెంపును ప్రారంభించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నికలకు ఆరు నెలల ముందువరకు 39లక్షల మందికి మాత్రమే పెన్షన్ ఇచ్చారని, ఎన్నికల రెండు నెలల ముందు వరకు కేవలం రూ. వెయ్యి పెన్షన్ మాత్రమే ఇచ్చారని గత టీడీపీ ప్రభుత్వంపై జగన్ విమర్శలు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పెన్షన్ ను పెంచుకుంటూ రూ. 3వేలు అందిస్తున్నామని అన్నారు. చంద్రబాబు హయాంలో నెలకు రూ. 400 కోట్లు ఇచ్చారని, ఇప్పుడు రూ. 2వేల కోట్లు ఇస్తున్నామని, పార్టీలకు అతీతంగా అర్హులందరికీ పెన్షన్ అందజేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
Also Read : షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: ఆళ్ల రామకృష్ణారెడ్డి
ఇటీవల పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంలో పేదలకు నిర్మిస్తున్న ఇండ్లలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలని కేంద్రానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖపై కాకినాడ సభలో సీఎం జగన్ ప్రస్తావించారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ లపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రతి పేదవారికి ఇండ్లు ఉండాలనే లక్ష్యంతో ఇండ్లు నిర్మించి ఇస్తున్నామని జగన్ అన్నారు. ఈ క్రమంలో 31లక్షల మందికి మహిళల పేరుపై ఇండ్ల పట్టాలు ఇచ్చామని, మరో 20లక్షల ఇండ్లు ఈరోజు నిర్మాణంలో ఉన్నాయని సీఎం జగన్ అన్నారు. పేద ప్రజలకు సొంతిల్లు ఉండాలని నేను తాపత్రయ పడుతుంటే.. దానిలో అవినీతి జరిగిందని, విచారణ జరిపించాలంటూ చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ కేంద్రానికి లేఖ రాశాడని, తద్వారా పేదలకు ఇచ్చే ఇండ్లనుసైతం అడ్డుకోవాలని చంద్రబాబు, పవన్ కుట్రపన్నుతున్నారని జగన్ ఆరోపించారు.
చంద్రబాబు, పవన్ కలిసి 2014లో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు. పేదలకు మూడు సెంట్ల భూమి ఇస్తామని వాగ్దానం చేశారు. ఒక్క సెంటుకూడా ఇవ్వలేదు. చంద్రబాబు హయాంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది.. ప్రశ్నిస్తానన్న దత్తపత్రుడు అప్పుడు కనీసం లేఖకూడా రాయలేదు. చంద్రబాబు అవినీతిని కేంద్ర దర్యాప్తు సంస్థలు నిర్ధారించి న్యాయస్థానం జైలుకు పంపింది. జైల్లో ఉన్న అవినీతిపరుడు చంద్రబాబును జైలుకెళ్లిమరీ దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ పరామర్శించాడు. అవినీతికి తావులేకుండా పాలన చేస్తున్న మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తాడంటూ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు అవినీతిలో పవన్ కల్యాణ్ కూడా భాగస్వామి అంటూ జగన్ అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో దోచుకోవటం దాచుకోవటం మాత్రమే జరిగిందని, అప్పట్లో దొంగల ముఠా పాలన జరిగిందని జగన్ విమర్శించారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు అమ్మవడి స్కీం లేదు, రైతు భరోసా స్కీం లేదు, వైఎస్సార్ ఆసరా అనే స్కీం లేదు. వైఎస్ఆర్ చేయూత అనే స్కీం లేదు.. కానీ ఇప్పుడు మీ జగన్ హయాంలో పేదలకు ఇబ్బందులు తొలగించే విధంగా అన్ని పథకాలను అమలు చేస్తున్నామని జగన్ చెప్పారు.
రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్దాలు చెప్పేందుకు చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు పవన్ కల్యాణ్ మీ ముందుకొస్తారు. ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాను అని చెబుతారంటూ జగన్ విమర్శించారు. కాకినాడలో తాగునీరు కోసం రూ. 47కోట్లు మంజూరు చేస్తున్నానని తెలిపారు. సుమారు 105 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని జగన్ అన్నారు.