షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా: ఆళ్ల రామకృష్ణారెడ్డి
వైఎస్ షర్మిలతోనే తన రాజకీయ ప్రయాణం ఉంటుందని ప్రకటించిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

Alla Ramakrishna Reddy confirmed to join congress with YS Sharmila
Alla Ramakrishna Reddy: ఊహించినట్టుగానే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా వెల్లడించారు. వైఎస్ షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి బుధవారం వెల్లడించారు. ఏపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరబోయే మొదటి ఎమ్మెల్యేను తానేనని ఆయన తెలిపారు. అమరావతి రాజధానికి తాను వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణను మాత్రమే వ్యతిరేకించానని చెప్పారు. షర్మిలతో పాటు ఈరోజు సీఎం జగన్ ను కలవనున్నట్టు చెప్పారు. కాగా, ఈరోజు సాయంత్రం తాడేపల్లిలో షర్మిల తన సోదరుడిని కలవనున్నారు. తన కుమారుడి పెళ్లికి సోదరుడిని వైఎస్ షర్మిల ఆహ్వానించనున్నారు.
ప్రతిపక్షం పోషిస్తాం: ఆర్కే
తామంతా కాంగ్రెస్ నుంచి వచ్చామని, తిరిగి అదే పార్టీలోకి వెళుతున్నామని ఎమ్మెల్యే ఆర్కే మీడియాతో అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దల సమక్షంలో షర్మిల పార్టీలో చేరతారని, ఆమె తర్వాత తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్యం ముందు నుంచి ఉందని, సంస్థాగతంగా బలమైన కార్యవర్గం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఎలాంటి బాధ్యతలు అప్పగించినా కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. కచ్చితంగా ప్రతిపక్షం పోషిస్తానని, కాంగ్రెస్ విధానాలకు అనుగుణంగా నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, టీడీపీ కలుస్తాయని తాను భావించడం లేదని అన్నారు. ఓటుకు కోట్లు కేసులో న్యాయపోరాటం కొనసాగుతుందని.. తప్పు ఎవరు చేసినా తప్పేనని పునరుద్ఘాటించారు.