CM Jagan: అక్టోబర్ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన.. సీఎం జగన్ కీలక నిర్ణయం!
చలో విశాఖ అంటూ తరచూ ప్రకటనలు చేసే ఏపీ ప్రభుత్వం.. ఈ సారి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే వచ్చే అక్టోబర్ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగాలని పట్టుదలగా ఉన్నారు సీఎం జగన్.

CM YS Jagan: మూడు రాజధానులపై (Three Capitals) పట్టుబట్టిన సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారా? త్వరలో విశాఖకు వెళ్దాం అంటూ ఎప్పటికప్పుడు ప్రకటనలు చేస్తున్న జగన్.. ఈ సారి ముహూర్తం ఫిక్స్ చేసేశారా? పరిపాలన రాజధానిపై (executive capital ) కోర్టులో వివాదం కొనసాగుతున్నందున.. ప్రస్తుతానికి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయాన్ని (CM Camp Office) తన నివాసాన్ని విశాఖపట్నానికి (Visakhapatnam) మార్చుకోవాలని భావిస్తున్నారట సీఎం జగన్.. అక్టోబర్ (October) కల్లా తన మకాం విశాఖకు మారేలా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారట. సీఎం జగన్ విశాఖకు వెళ్లడం ఖాయమేనా? అధికారులు ఏం చేస్తున్నారు?
చలో విశాఖ అంటూ తరచూ ప్రకటనలు చేసే ఏపీ ప్రభుత్వం.. ఈసారి ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో అంటే వచ్చే అక్టోబర్ నుంచే విశాఖ కేంద్రంగా ప్రభుత్వ పాలన కొనసాగాలని పట్టుదలగా ఉన్నారు సీఎం జగన్. మొత్తం పాలనా యంత్రాంగాన్ని విశాఖకు తరలిస్తారా? లేదా? అన్నది క్లారిటీ లేకపోయినా.. సీఎం క్యాంపు కార్యాలయం మాత్రం విశాఖకు తరలిపోవడం ఖాయమని చెబుతున్నారు. ఇప్పటికే రుషికొండలో సీఎం ఆఫీస్ భవనాలు సిద్ధమయ్యాయని అంటున్నారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని రాజధాని రైతులు కేసులు వేయడంతో జగన్ కోరుకున్న మూడు రాజధానులు ప్రతిపాదన ఇన్నాళ్లు ముందుకు కదలలేదు. ఇప్పుడు కూడా కోర్టు కేసు ప్రతిబంధకంగా ఉన్నా.. ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా పాలించే సౌలభ్యం ఉండటంతో విశాఖకు తరలివెళ్లాలని డిసైడయ్యారు జగన్.
గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన చేశారు. రాష్ట్రం అన్నివిధాల అభివృద్ధి జరగాలంటే.. రాజధాని ప్రాంతంలోనే అభివృద్ధి కేంద్రీకృతం కాకూడదని.. నలువైపులా అభివృద్ధి జరగాలని జగన్ ఆలోచన. అంతేకాకుండా ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో అమరావతిలో రాజధాని నిర్మించడం భారంగా భావిస్తోంది వైసీపీ ప్రభుత్వం. అందుకే అన్ని వనరులు ఉన్న విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలని ప్రతిపాదిస్తోంది. దీనికి అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ కోర్టుకెక్కడం.. అసెంబ్లీ ఆమోదించిన బిల్లు కూడా లోపభూయిష్టంగా ఉండటంతో వెనక్కి తీసుకుంది ప్రభుత్వం. కానీ, ఎలాగైనా విశాఖలో పరిపాలన రాజధాని స్థాపించాలనే నిర్ణయానికి మాత్రం కట్టుబడే ఉంది. ఎప్పటికప్పుడు విశాఖ నుంచి పరిపాలన సాగిస్తామని గతంలో చాలా సార్లు ప్రకటించింది. సంక్రాంతి, ఉగాది, దసరా వంటి పండగలతో పాటు.. జూన్, జులై అంటూ ఎప్పటికప్పుడు నెలలు.. రోజులు ప్రకటిస్తూ.. విశాఖ రాజధాని అన్న పాయింట్‌ను ఎప్పుడూ హాట్‌టాపిక్‌గానే ఉంచింది. ఐతే ఇన్నాళ్లు ఈ తేదీలు, నెలలు వాయిదా పడినా ఈ సారి మాత్రం అక్టోబరు ముహూర్తం పక్కాగా ఫిక్స్ అంటున్నారు పరిశీలకులు.
Also Read: వలంటీర్ల వేతనాల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం?
మరో ఎనిమిది నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ఈ లోగా విశాఖకు మారాలనేది సీఎం జగన్ పట్టుదల. ఎన్నికల్లోగా తన నిర్ణయం అమలు చేసి విశాఖ కేంద్రంగా ఒక్కరోజైనా పరిపాలించి.. తాను అనుకున్నది చేసి చూపించానని చాటాలని భావిస్తున్నారు జగన్. అందుకే రుషికొండలో పర్యాటక శాఖ^నిర్మిస్తున్న భవనాల్లో ఒకదాంటో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం చేయాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఉన్నతస్థాయిలో ఈ నిర్ణయం జరిగిపోవడంతో సీఎం సెక్యూరిటీ వింగ్ కూడా ఆ భవనాలను పరిశీలించిందని చెబుతున్నారు. రుషికొండ నిర్మాణాలపైనా వివాదం ఉన్నా.. ప్రభుత్వ మాత్రం చాలా పట్టుదల ప్రదర్శిస్తోంది. శరవేగంగా నిర్మాణాలు పూర్తి చేస్తోంది.
Also Read: భీమిలిలో అవంతి శ్రీనివాస్‌కు పరిస్థితులు అనుకూలంగా లేవా.. సీటు మారుస్తారా?
కార్పొరేట్ తరహాలో నిర్మిస్తున్న ఈ భవనాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయనుందని చెబుతున్నారు. ఐతే ప్రస్తుతానికి సీఎం క్యాంపు కార్యాలయం తరలించడానికి అడ్డంకులు.. అవాంతరాలు ఏమీ లేకపోవడంతో అక్టోబర్‌కల్లా పెండింగ్ పనులు చేయాలని ఆదేశాలు వెళ్లాయి. ప్రస్తుతం చకచకా పనులు జరుగుతున్నాయి. అనుకున్నట్లు పనులు పూర్తయితే సీఎం పట్టుబట్టినట్లు విశాఖలో అక్టోబర్‌లో అడుగుపెట్టడం ఖాయమే.. ఐతే సచివాలయం.. సీఎం ఫేసీ, మంత్రుల కార్యాలయాలు కూడా వస్తాయా? మంత్రులు కూడా క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేసుకుంటారా? లేక సీఎం ఒక్కరే విశాఖ నుంచి పరిపాలన మొదలుపెడతారా? అన్నది క్లారిటీ రావడం లేదు.
రుషికొండలో కనిపిస్తున్న జోరు.. విశాఖ అధికారుల్లో హడావుడి పరిశీలిస్తే.. అక్టోబర్ ముహూర్తానికి పక్కా ఏర్పాట్లు చేస్తున్నట్లే కనిపిస్తోంది. రాబోయే రెండు నెలల్లో సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం మార్పుపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.