YS Jagan : ఫిషింగ్ హార్బర్లపై జగన్ ఫోకస్

Ap Cm Ys Jagan Review Meeting On Agri Infra Fund Projects Fishing Harbours

YS Jagan : విశాఖ పట్నం, కాకినాడ ఫిషింగ్ హార్బర్‌ల అభివృధ్దికి కార్యాచరణ ప్రణాళిక రూపోందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు ఆయన తన క్యాంపు కార్యాలయంలో  వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ మార్కెటింగ్ , ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృధ్ది సహకార సమాఖ్య, మత్స్యశాఖ, ఫుడ్ ప్రోసెసింగ్ సొసైటీ, పశుసంవర్ధక విభాగాల్లో మౌలిక సదుపాయాల కల్పన అభివృధ్ది ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ … ‘‘ప్రాజెక్టులన్నీ నిర్ణీత సమయంలో పూర్తి కావాలని.. గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల మధ్య అనుసంధానం సమర్థవంతంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలి… అనుకున్న సమయానికి అన్ని ప్రాజెక్టులు ఏర్పాటు కావాలని అన్నారు. పనుల ప్రగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. ప్రతి 15 రోజులకోసారి సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. అధికారుల స్థాయిలో ప్రతి ఆదివారం సమీక్ష చేయాలి’’ అని చెప్పారు.

ప్రకాశం జిల్లా కొత్తపట్నంలో ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. దీనితో పాటు కాకినాడ ఫిషింగ్‌ హార్బర్ అభివృద్ధికి సంబంధించి కార్యాచరణ తయారు చేయాలని…. విశాఖపట్నం ఫిషింగ్‌ హార్భర్‌ అభివృద్ధిపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. ఈనెల 4వ తేదీ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అమూల్‌ పాల సేకరణ మొదలవుతుందని చెప్పారు. ఇందువల్ల రాష్ట్రంలో మహిళా రైతులకు రూ.3.91 కోట్లు అదనంగా ఆదాయం చేకూరుతుందని అన్నారు.

కాగా, అగ్రి ఇన్‌ఫ్రా ఫండ్‌ (ఏఐఎఫ్‌) ప్రాజెక్టులకు సంబంధించి ఆయా రంగాలు, విభాగాలలో వివిధ ప్రాజెక్టుల, పనుల పురోగతిని సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. ఆ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం రూ.15,743 కోట్లు అని అధికారులు తెలిపారు.