Narayana swamy
డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కోర్టులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. రాజకీయ పార్టీలు హైకోర్టు, సుప్రీంకోర్టులకు చెప్పి మేనిఫెస్టో తయారు చేయవని అన్నారు. పేదలకు ఇళ్లు ఇస్తామని మా మేనిఫెస్టోలో చెప్పామని నారాయణ స్వామి స్పష్టం చేశారు. ఉన్నవాళ్లే భూ కబ్జాలు చేస్తారని ఆరోపించారు.. పేదవాళ్లు భూ కబ్జాలు చేయరని అన్నారు.
పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కోర్టు స్టే ఇవ్వడం సరికాదన్నారు. ఇళ్ల స్థలాల అంశంలో కోర్టులు త్వరగా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.. ఇళ్ల పట్టాల కేసులను కోర్టులు త్వరగా పరిష్కరించాలని ఆయన అన్నారు. అమరావతిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే టీడీపీ తపన అన్నారు. సుప్రీంకోర్టు హైకోర్టు జారీ చేసిన ఆదేశాలను సమర్థించింది.
అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం ఆర్-5 ఉత్తర్వులు చేసింది. దీనిపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ పై విచారణ జరుపుతున్నహైకోర్టు విచారణ పూర్తయ్యేంత వరకు ఆ ఉత్తర్వులను సస్పెన్షన్ పెట్టింది. దానిపై జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకోర్టు జారీ చేసిన సస్పెన్షన్ ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. హైకోర్టులో తుది విచారణ జరగాలని సుప్రీంకోర్టు తెలిపింది.
రాజధాని భూములను పేదలకు పంచాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఆర్-5ను జారీ చేసింది. జగన్ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఆర్-5 జోన్‌ను ఏర్పాటు చేసింది. రాజధాని ప్రాంతంలోని కృష్ణాయపాలెం, వెంకటపాలెం, నిడమర్రు, కురగల్లు, మందడం, ఐనవోలు గ్రామాల పరిధుల్లోని 967.25 ఎకరాలను నివాస ప్రాంతాలుగా బదలాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.