పాలకొండలో జనసేన ఎమ్మెల్యే Vs టీడీపీ ఇంచార్జ్..! ఇప్పుడెలా?
ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇంఛార్జ్ మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరులో ఇరు పార్టీల కార్యకర్తలు నలిగిపోతున్నారట.
- రిజర్వ్డ్ సెగ్మెంట్లో కూటమి నేతల మధ్య ఆధిపత్య పోరు
- ఎమ్మెల్యే, టీడీపీ ఇంఛార్జ్ మధ్య క్యాడర్ నలిగిపోతున్నారా?
- ఇలాగే కొనసాగితే అక్కడ కూటమి పరిస్థితి ఏంటి?
Palakonda Constituency: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. స్ధానిక జనసేన ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ వర్సెస్ టీడీపీ ఇంఛార్జ్ పడాల భూదేవి మధ్య కోల్డ్‌వార్ పీక్ లెవల్‌కు చేరుకుంది. ఈ ఇద్దరు నేతలు గతంలో టీడీపీలో పనిచేసిన వారే. గత ఎన్నికలకు ముందు పాలకొండ రిజర్వ్డ్ సీటు కోసం ఇద్దరు నేతలు హోరాహోరీగా తలపడ్డారు. అనూహ్య పరిణామాల మధ్య పాలకొండ రిజర్వ్డ్ సీటును కూటమి పార్టీల సర్ధుబాటులో భాగంగా జనసేనకు కేటాయించారు.
దీంతో టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న జయకృష్ణ జనసేనలో చేరటం..తర్వాత ఆ సీటును ఆయనకు కేటాయించడం జరిగిపోయింది. అయితే జయకృష్ణకు టీడీపీ క్యాడర్‌తో ఉన్న సత్సంబంధాలు ఆయన గెలుపును బాగా పనికొచ్చాయి. ఎలాగైనా ఎమ్మెల్యే కావాలనుకున్న జయకృష్ణకు జనసేన పార్టీ రూపంలో ఎమ్మెల్యే పదవి వరించింది. ఇదే క్రమంలో ఇక్కడి నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ పడాల భూదేవిని టీడీపీ పార్టీ అధిష్టానం నియోజకవర్గ ఇంఛార్జ్‌గా నియమించింది. దీంతో టీడీపీ క్యాడర్ రెండు వర్గాలుగా విడిపోయారు.
Also Read: ఎంపీటీసీ, జడ్పీటీసీ వ్యవస్థను రద్దు చేసే యోచనలో ప్రభుత్వం..!?
ఎమ్మెల్యే వర్సెస్ పార్టీ ఇంఛార్జ్ మధ్య నడుస్తోన్న ఆధిపత్య పోరులో ఇరు పార్టీల కార్యకర్తలు నలిగిపోతున్నారట. ఓ వైపు ఎమ్మెల్యే జయకృష్ణ నియోజకవర్గంపై తన మార్క్ చూపించుకునే ప్రయత్నం చేస్తుంటే..పార్టీ ఇంఛార్జ్ పడాల భూదేవి పార్టీలో తన పట్టు నిలుపుకునేందుకు తంటాలు పడుతున్నారు. ఎమ్మెల్యే జయకృష్ణ వెంట నడుస్తున్న టీడీపీ క్యాడర్ భూదేవి నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అలాగే భూదేవి వర్గం నేతలు జయకృష్ణ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
టీడీపీ ఇంచార్జ్ పడాల భూదేవి వర్గం..ఆమె వ్యతిరేక వర్గం మధ్య మార్కెట్ కమిటీ నామినేటెడ్ పదవుల వ్యవహారం మరింత వేడి రాజేసింది. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని పనిచేసిన వారిని కాదని ఇంఛార్జ్ భూదేవి తనకు ఇష్టం వచ్చినవారిని మార్కెట్ కమిటీ డైరెక్టర్లుగా నియమించారంటూ టీడీపీలోని మరోవర్గం ఆరోపిస్తోంది.
అభివృద్ధి కార్యక్రమాలకు కూడా భూదేవి డుమ్మా?
పాలకొండ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు కూడా భూదేవి డుమ్మా కొట్టేస్తున్నారట. 2024 ఎన్నికల్లో టీడీపీ సీటును నిమ్మక జయకృష్ణ, పడాల భూదేవి ఇద్దరూ ఆశించారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతలు ఉప్పు, నిప్పులా ఉంటూ వస్తున్నారు. టీడీపీలో ఏ చిన్న కార్యక్రమం జరిగినా పడాల భూదేవి వర్గం, ఆమె వ్యతిరేకవర్గం మధ్య ఉన్న విభేదాలు బయటపడుతున్నాయట.
ఎన్నికల టైమ్‌లో కూటమి తరఫున పోటీ చేసిన జనసేన అభ్యర్థి నిమ్మక జయకృష్ణను ఓడించాలని ప్రయత్నించిన వారికి పదవులు ఇచ్చారంటూ భూదేవి వ్యతిరేక వర్గీయులు ప్రశ్నించారు. వైసీపీకి అనుకూలంగా ఓట్లు వేయించేందుకు కుట్రపన్నిన వారికి మార్కెట్ కమిటీ పదవులు దక్కడంపై పాలకొండ, వీరఘట్టం మండల నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఎమ్మెల్యేగా తాను చెప్పినమాటే ఫైనల్ అని జయకృష్ణ వాదిస్తుంటే..టీడీపీ ఇంఛార్జ్‌గా తన మాటే నెగ్గాలనే పట్టుదలకు పోతున్నారట భూదేవి. ఇలాంటి పరిస్ధితుల్లో నియోజకవర్గ కూటమిలో గ్రూపుల గోలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు కార్యకర్తలు. రెండు పార్టీల పెద్దలు ఈ గ్రూపు వివాదాలకు చెక్ పెట్టాలని కోరుతున్నారు. కూటమి పెద్దలు కలగజేసుకుని ఈ పంచాయితీకి చెక్ పెడుతారో లేదో చూడాలి మరి.
