అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు..! కేసు కీలక టర్న్?
అనంతబాబుకు నేర చరిత్ర లేదంటూ చార్జిషీటులో మెన్షన్ చేసి..బెయిల్ రావడానికి మార్గం సుగమం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఫైనల్‌గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది.
- సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు కీలక టర్న్ తీసుకునే అవకాశం
- అనంతబాబుకు సహకరించిన పోలీసు అధికారులెవరు?
- పోలీసులతో పాటు అనంతబాబుకు ఉచ్చు బిగిసినట్లేనా?
Anantha Babu Driver: ఏపీ పాలిటిక్స్‌లో సంచలనం సృష్టించిన వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. నాలుగేళ్లుగా ఎన్నో మలుపులు తిరుగుతూ వస్తున్న మర్డర్ కేసుపై..లేటెస్ట్గా సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అప్పట్లో ఈ కేసు విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దర్యాప్తు సంస్థలు, నిందితుడు ఒక్కటైనట్లుగా బిహేవ్ చేశారని మండిపడింది. దర్యాప్తులో పోలీసుల తీరును తప్పుబట్టింది.
నిందితుడితో పోలీసులు ఇప్పటికీ చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నట్లు కనిపిస్తోందని..ఇంత దారుణంగా వ్యవస్థలు నిర్వీర్యం అవుతుంటే డీజీపీ, ఎస్పీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించింది కోర్టు. అనంతబాబుకు బెయిల్ వచ్చేలా ఉద్దేశపూర్వకంగానే ఛార్జిషీట్ దాఖలు వేయడంలో ఆలస్యం చేశారని, నిందితుడితో పోలీసులు కుమ్మక్కైనట్లు స్పష్టం అవుతుందని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నవంబర్ 18లోపు ట్రయల్ కోర్టు విచారణను పూర్తి చేసి, కేసు విచారణ కోసం మార్చి 31 లోగా హైకోర్టు ఒక సీనియర్ జ్యుడిషియల్ ఆఫీసర్‌ను ప్రత్యేకంగా నియమించాలని కూడా ఆదేశించింది కోర్టు. 2022 మే 19న ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది.
ఈ కేసులో ఆరోపణలు ఫేస్ చేస్తున్న అనంతబాబు బెయిల్ మీదున్నారు. ఇప్పుడాయన అజ్ఞాతంలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. హత్యలో అనంతబాబు భార్య ప్రమేయం ఉందని ఆరోపించిన సిట్..చార్జిషీట్లో ఆమెను ఏ-2గా పేర్కొంది. ప్రస్తుతం అనంతబాబు సతీమణి లక్ష్మీదుర్గ కూడా పరారీలో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే నిందితుడు 2022 నుంచి మధ్యంతర బెయిల్ మీదున్నా..ఇప్పటికీ దర్యాప్తు పూర్తి కాకపోవడం ఏంటంటూ సుప్రీంకోర్టు మండిపడింది.
Also Read: AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం..
ఇది పోలీసుల నిర్లక్ష్యం కాకపోతే మరేమిటని కూడా ప్రశ్నించింది. సాక్షులను బెదిరించడానికి ప్రయత్నించినా, ఆధారాలను మాయం చేయాలని చూసినా బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించింది కోర్టు. అయితే లేటెస్ట్గా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో నాడు ఈ కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన పోలీసుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు కాకినాడ జిల్లా ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్‌రెడ్డితో పాటు..అప్పటి అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు భీమారావు, మురళీ, సీఐ మురళీకృష్ణరెడ్డిపై వేటు తప్పదని పోలీస్ శాఖలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
అప్పట్లో పెద్ద దుమారం
కీలక పోలీస్ ఆఫీసర్లు.. డ్రైవర్ సుబ్రహ్మణ్యం మర్డర్‌ను.. అనుమానాస్పద హత్యగా నమోదు చేయడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు ఉన్నాయి. బాధితులు, దళిత సంఘాల ఆందోళనలతో కేసును హత్య కేసుగా మార్చారు. కానీ, అనంతబాబును అరెస్ట్ చేయడానికి కనీసం ప్రయత్నం చేయలేదని అప్పట్లో పెద్ద దుమారం నడిచింది. పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు రావడంతో తప్పని పరిస్థితుల్లో అనంతబాబును అరెస్ట్ చేశారన్న విమర్శలు వచ్చాయి.
అనంతబాబు అరెస్టు సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరు కాంట్రవర్సీ అయింది. నిందితుడిగా ఆరోపిస్తున్న వ్యక్తిని జిల్లా ఎస్పీ అనంతబాబు గారు అని సంబోధించడం హాట్ టాపిక్ అయింది. హత్య జరిగిన ఘటనా స్థలిలో సీసీ ఫుటేజీలను..నిందితుల కాల్ రికార్డులు సేకరించలేదని..గూగుల్ టేకవుట్ కోసం సకాలంలో ప్రయత్నించాల్సి ఉన్నా, కావాలని లేట్ చేశారని ఎన్నో అలిగేషన్స్ ఉన్నాయి. హత్య తర్వాత అనంతబాబు నుంచి పోలీసులు సీజ్ చేసిన ఫోన్‌ను ఇప్పటికీ ఓపెన్ చేయలేదని అంటున్నారు.
పైగా అనంతబాబుకు నేర చరిత్ర లేదంటూ చార్జిషీటులో మెన్షన్ చేసి..బెయిల్ రావడానికి మార్గం సుగమం చేశారన్న విమర్శలు వచ్చాయి. ఫైనల్‌గా ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతో కేసు దర్యాప్తు మరింత స్పీడప్ అయ్యే అవకాశం ఉంది. కోర్టు అనంతబాబు బెయిల్‌ను కంటిన్యూ చేయడంతో..ఏ-2గా ఉన్న ఆయన భార్య లక్ష్మీదుర్గను అరెస్ట్ చేసేందుకు పోలీసులు రెడీ అవుతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక అప్పటి పోలీస్ అధికారులపై వేటు వేస్తారన్న ప్రచారం కూడా ఊపందుకుంది. అనంతబాబు డ్రైవర్ హత్య కేసు ఇంకా ఎన్ని మలుపులు తీసుకుంటుందో.? ఏం జరగబోతుందో వేచి చూడాలి మరి.
