kashibugga stampede
kashibugga stampede : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషాద ఘటన సమాచారం తెలుసుకున్న జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయం వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన తీవ్రంగా కలచివేసింది. కార్తీక ఏకాదశి సందర్భంగా ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న క్రమంలో తొక్కిసలాట మూలంగా తొమ్మిది మంది మృతి చెందారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. ఈ విషాదకర ఘటనలో మృతి చెందినవారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు స్పష్టం చేయడమైంది. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా అధికార యంత్రాంగానికి ప్రభుత్వం దిశానిర్దేశం చేసింది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకొంటుందని పవన్ పేర్కొన్నారు.
ప్రైవేట్ వ్యక్తుల నిర్వహణలో ఉన్న ఈ ఆలయంలో చోటు చేసుకున్న విషాదకర ఘటనపై విచారణ చేపడతాం. కార్తీక మాసంలో రాష్ట్రంలోని శైవ క్షేత్రాలతోపాటు, ప్రముఖ ఆలయాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. క్యూ లైన్ల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని దేవాదాయ శాఖ అధికారులకు సూచిస్తున్నాను. మహిళలు, చిన్న పిల్లలు, వృద్ధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి. ఆలయ ప్రాంగణాల్లో తగిన రక్షణ చర్యలు చేపట్టాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనాకు వచ్చినప్పుడు పోలీసు బందోబస్తుతోపాటు, మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ తెలిపారు.