Stampede : కాశీబుగ్గలో తొక్కిసలాట ఘటన.. వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి.. కూటమి ప్రభుత్వంపై కీలక కామెంట్స్..
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనపై వైఎస్ జగన్ మోహన్ రెడ్డి
YS Jagan
Stampede : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మరణించగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే, చికిత్స పొందుతున్న వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ విషాద ఘటన సమాచారం తెలుసుకున్న వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంపై కీలక కామెంట్స్ చేశారు.
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ దుర్ఘటనలో భక్తులు మరణించడం అత్యంత విచారకరం. మీడియాలో సమాచారం మేరకు 10 మంది మరణించారని తెలుస్తోంది. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. గాయపడ్డవారికి మెరుగైన చికిత్స అందించాలి. సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని మా పార్టీకి చెందిన నాయకులను ఆదేశించాను.
తిరుపతిలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట జరిగి 6గురు భక్తులు మరణించారు. అలాగే సింహాచలంలో జరిగిన దుర్ఘటనలో మరో ఏడుగురు మరణించారు. ఇప్పడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కారణంగా ఇప్పటివరకూ 10 మంది మరణించారని మీడియా ద్వారా సమాచారం వస్తోంది. ఈ 18 నెలల కాలంలో వరుసగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వం సరైన జాగ్రత్తలు తీసుకోవడం లేదన్నది అర్థం అవుతోంది.
పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరిస్తూ భక్తుల ప్రాణాలను బలితీసుకుంటున్నారు. చంద్రబాబు అసమర్థ పాలనకు నిదర్శనం ఇది. ఇకనైనా కళ్లుతెరిచి తప్పులను సరిదిద్దుకోవాలి అంటూ జగన్ అన్నారు.
