Pawan Kalyan
Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) గేర్ మార్చారా.. రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేయబోతున్నారా.. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూనే.. జనసేన పార్టీని బలపర్చేందుకు చర్యలు చేపడుతున్నారా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇటీవల పార్టీ బలోపేతం చేసుకోవాలని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ కల్యాణ్ నిర్దేశించారు. ఎక్కువగా ప్రజల మధ్యలోనే ఉండాలని, ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇదే సమయంలో పవన్ సైతం నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం హోదాలో జిల్లాల్లో పర్యటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. జనసైనికులతో ప్రత్యేకంగా భేటీలు కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పవన్ కల్యాణ్ ఈ నెలలో పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడంతోపాటు.. ఆయా జిల్లాల్లో జనసైనికులు, వీరమహిళలు, పార్టీ నేతలతో భేటీ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను రూపొందించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలుత పార్త్వతీపురం మన్యం జిల్లా కురుపాం వెళ్తారు. అక్కడి గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన క్రమంలో ఆ పాఠశాలను పరిశీలిస్తారు. ఆ తరువాత పిఠాపురం నియోజకవర్గంలో పవన్ పర్యటిస్తారు. ప్రకాశం, శ్రీపొట్టి రాములు నెల్లూరు జిల్లాల్లోనూ పవన్ పర్యటన ఉంటుందట. ఆ తరువాత రాజోలు నియోజకవర్గంలో పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గోనున్నారు.
అయితే, ఈ పర్యటనకు సంబంధించిన తేదీలను త్వరలో ఖరారు చేయనున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొన్న తరువాత ఆ ప్రాంత జనసైనికులు, వీర మహిళలు, నాయకులతో పవన్ కల్యాణ్ భేటీ అవుతారని పార్టీ నేతలు చెబుతున్నారు.