Chandrababu Delhi Tour (Photo Credit : Google)
Chandrababu Delhi Tour : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. గన్నవరం విమానాశ్రయం నుండి ఉదయం 11 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు చంద్రబాబు. ఢిల్లీలో జరిగే ఎన్డీయే మీటింగ్ లో ఆయన పాల్గొననున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీయే సమావేశం కానుంది. ఈ సమావేశానికి చంద్రబాబు, నితీశ్ కుమార్ సహా ఎన్డీయే పక్ష నేతలు హాజరుకానున్నారు.
కాగా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తో చంద్రబాబు సుమారు గంట సేపు భేటీ అయ్యారు. ఇరువురు నేతలు పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. కూటమి పక్షాలకు వచ్చిన సీట్లు, మెజారిటీలపై చర్చించారు. ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ భేటీకి హాజరుపైనా డిస్కస్ చేసుకున్నారు. ఇరువురు నేతలు ఢిల్లీకి వెళ్ళనున్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు, ప్రమాణ స్వీకారం, తేదీ, స్థలం తదితర అంశాలపైనా చంద్రబాబు, పవన్ మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. ఎన్డీఏ సమావేశంలో ఏపీకి సంబంధించి ఏయే అంశాలపై చర్చించాలనే విషయంపైనా సమాలోచనలు చేసినట్లు తెలుస్తోంది. ఇక, ఏపీ క్యాబినెట్ కూర్పు తదితర అంశాలపై మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, పవన్ నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ గెలిచింది, ప్రజలు గెలిచారు- చంద్రబాబు
ఏపీ ఎన్నికల ఫలితాలు, కూటమి సునామీపై చంద్రబాబు స్పందించారు. ఆంధ్రప్రదేశ్ గెలిచింది, రాష్ట్ర ప్రజలు గెలిచారు అని చంద్రబాబు అన్నారు. ఇవాళ నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయిందని ఎమోషన్ అయ్యారు. టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి సేవ చేసేందుకు అఖండమైన ఆదేశంతో ఆశీర్వదించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం జరిగిన యుద్దంలో గెలిచామని, కలిసికట్టుగా రాష్ట్ర పునర్ నిర్మాణం చేపడతామని చంద్రబాబు చెప్పారు.
ఏపీ భవిష్యత్తు కోసం మేమున్నామని చెప్పిన ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షా, జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. పవన్ కళ్యాణ్, పురందేశ్వరితో పాటు జనసేన, బీజేపీ శ్రేణులకు అభినందనలు తెలిపారు చంద్రబాబు. ఈ మహత్తర విజయం కూటమి నాయకులు, కార్యకర్తల కృషి, అంకితభావం వల్ల సాధ్యమైందన్నారు. చివరి ఓటేసే వరకు ధైర్యంగా పోరాడారని కితాబిచ్చారు. కూటమి కార్యకర్తలు, నేతల అచంచలమైన నిబద్ధతకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు చంద్రబాబు. ఈ అద్భుతమైన విజయానికి అభినందనలు తెలియజేశారాయన.
Also Read : వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు