వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు

అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే.. అభివృద్ధి పెత్తందార్ల కోసం, ప్రజల కోసం కాదని అన్నారు. అసలు అభివృద్ధి ఎందుకు? అని విచిత్రమైన వాదన తీసుకొచ్చారు.

వైసీపీ ఘోర పరాజయానికి ప్రధాన కారణమిదే- ఏపీ ఎన్నికల ఫలితాలపై జేపీ సంచలన వ్యాఖ్యలు

AP Election 2024 Results : ఏపీ ఎన్నికల ఫలితాలపై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక విశ్లేషకులు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. ఈ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలు ఏంటో ఆయన వివరించారు.

”లోతైన ఆలోచనతో ముందుచూపుతో ఓటు వేసిన ఏపీ ప్రజలను, ఘన విజయం సాధించిన కూటమిని మనసారా అభినందిస్తున్నా. ఏపీలో జరగబోయే ఎన్నికలు నిర్ణయాత్మకమైనవని ఎప్పటి నుంచో చెబుతున్నా. అసలు ప్రభుత్వం అంటే.. ప్రజాధనాన్ని కొంత దుబారా చేసి, కొంత తినేసి, మిగతాదంతా పంచి పెట్టడమే. బటన్ నొక్కడమే. ఇంకేమీ అక్కర్లేదు. సంక్షేమమే పరిపాలన అన్నది సిద్ధాంతంగా మార్చింది వైసీపీ.

అభివృద్ధి గురించి ఎవరైనా మాట్లాడితే.. అభివృద్ధి పెత్తందార్ల కోసం, ప్రజల కోసం కాదని అన్నారు. అసలు అభివృద్ధి ఎందుకు? అని విచిత్రమైన వాదన తీసుకొచ్చారు. ఆ వాదనకి సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలి. సంపద పెరగాలి. పేదల జీవితాలు బాగుపడాలి. పుచ్చుకునే చేతుల్లానే ఉండకూడదు. తలెత్తుకుని బతకాలి. కానీ అలా జరగలేదు. అంతేకాదు పూర్తి అడ్డగోలుగా, ఏకపక్షంగా పరిపాలన సాగింది. మాఫియా రాజ్యంలా, రాచరికంలా పాలన నడిచింది. ఈ రెండు అంశాలపై ప్రజలు తీర్పు ఇచ్చారు” అని జేపీ కామెంట్ చేశారు.

”రెండు విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. ఒకటి.. సంక్షేమం ఒక్కటే చాలదు. అభివృద్ది కూడా కావాలి. మా బతుకులు బాగుపడాలి. రెండోది.. అడ్డగోలు పరిపాలనతో లాభం లేదు. ఇది రాచరికం కాదు. ప్రజాస్వామ్యం. కొన్ని పద్ధతులు పాటించాలి. దానికి గుణాత్మకమైన తీర్పు ఇచ్చిన ప్రజలను అభినందిస్తున్నా. ఇక ప్రాంతీయ పార్టీలు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే.. అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు. ఎల్లకాలం మేమే ఉంటాం అనే అహంకారానికి పోతే ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయి.

రెండోది.. ఎన్నికైన వాళ్లు రాజులు కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎన్నికైన వారు ప్రజల ప్రతినిధులు, ప్రజా సేవకులు మాత్రమే. మూడోది.. ప్రతిపక్షం, అధికార పక్షం వేర్వేరు కాదు. పోటీ కోసం పక్షాలు ఉంటాయి. రాజ్యాంగ విలువల కోసం, రాష్ట్రాభివృద్ధి కోసమే పక్షాలు ఉంటాయి తప్ప.. బద్ద శత్రువులు కాదు.. ఇది శత్రు రాజ్యాల మధ్య పోరాటం కానే కాదు. నాలుగో అంశం.. చట్టబద్దత పాలన అమలు అవసరం. ప్రజలు అధికారం ఇచ్చింది నవాబుల్లా, చక్రవర్తుల్లా పరిపాలించడానికి కాదు. చట్టం అందరికీ సమానమే. ఐదో అంశం.. ఏ పార్టీకి అయినా సిద్ధాంతం ఉండాలి. ఏదో ఒక రకంగా ఓట్లు పొంది అధికారంలోకి వచ్చేసి.. రాచరికం చలాయిస్తాను అంటే.. అది రాజకీయ పార్టీ కాదు. దీర్ఘకాలికంగా సిద్ధాంత బలం ఉండాలి. కొన్ని లక్ష్యాలకు, విలువలకు కట్టుబడి ఉండాలి” అని జేపీ అన్నారు.

”తాత్కాలిక సంక్షేమం ఒక్కటే సరిపోదని ప్రజలు నిర్ణయించారు. తాత్కాలిక ప్రయోజనం పొందుతున్న వారు పేదరికం నుంచి బయటపడాలని భావించారు. పేదలు గణనీయమైన సంఖ్యలో ఓట్లు వేయకపోతే.. ఇంత పెద్దఎత్తున మార్పు వచ్చి ఉండేది కాదు. ప్రజల్లో ఉన్న చైతన్యం, చంద్రబాబు నాయకత్వం. చంద్రబాబుపై ప్రజలకు అపారమైన విశ్వాసం ఉంది. అభివృద్ధికి బాటలు వేయడం, పెట్టుబడులను ప్రోత్సహించడం, సంపద పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పించడం. ఈ విషయాల్లో చంద్రబాబు ఘనత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. హైదరాబాద్ నగర చరిత్రే గొప్ప ఉదాహరణ. ఏపీలో 2014 నుంచి 2019 వరకు వనరులు లేకపోయినా.. డబ్బుకు లోటు లేకుండా చంద్రబాబు అభివృద్ధి పనులు చేశారు” అని జేపీ చెప్పారు.

Also Read : నాకు ఎలాంటి బెదిరింపులు రాలేదు, కూటమి సునామీకి ప్రధాన కారణమిదే- కేకే కీలక వ్యాఖ్యలు