AP Free Bus
AP Free Bus : స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యంను ఏపీలోని కూటమి ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఆగస్టు 15న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ప్రారంభించారు. అయితే, ఈ ఫ్రీ బస్సు సౌకర్యాన్ని మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారు. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. (AP Free Bus)
స్త్రీశక్తి పథకం అమలవుతున్న పల్లెవెలుగు, ఆల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రతిరోజూ 21లక్షల మంది మహిళలు ఉచితంగా ప్రయాణిస్తున్నారని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. ఈ పథకంను ప్రారంభించిన తొలి వారంరోజుల్లో కోటి మంది మహిళలు ప్రయాణాలు చేసినట్లు వెల్లడించారు. దీనిద్వారా మహిళలకు వారంలో రూ.41.22 కోట్ల లబ్ధి చేకూరిందని చెప్పారు. అయితే, ఈ సందర్భంగా ప్రభుత్వం మహిళలకు మరో శుభవార్త చెప్పింది.
రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఆర్టీసీ పరిధిలో ప్రస్తుతం ఉన్న బస్సుల ద్వారా మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. అయితే, త్వరలో మరిన్ని బస్సులు అందుబాటులో తేబోతుంది కూటమి ప్రభుత్వం. బస్సుల్లో రద్దీని తగ్గించేలా త్వరలోనే 1,050 ఎలక్ట్రిక్ బస్సులు, మరో 1500 బస్సులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు చెప్పారు.
కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఉచిత బస్ ప్రయాణం మహిళలకు మరింతగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో బస్సుల కొరత కారణంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే బస్సుల్లో రద్దీ తగ్గుతుందని భావిస్తున్నారు.
ఇదిలాఉంటే.. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ సౌకర్యం తిరుమల కొండపై వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే, ఘాట్ రోడ్డు కావడం వల్ల
సీటింగ్ వరకే ప్రయాణికులకు అనుమతి ఇస్తున్నారు. ఈ ఫ్రీ బస్సు ప్రయాణం పథకాన్ని ముఖ్యంగా ఆస్పత్రులకు, పుణ్యక్షేత్రాలకు వెళ్లేవారు, చిరుద్యోగాలు చేసే మహిళలు సద్వినియోగం చేసుకుంటున్నారని అధికారులు పేర్కొంటున్నారు.