Pensions : పెన్షన్ల పంపిణీపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఈసారి నగదు ఎలా ఇస్తారంటే

పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Pensions : పెన్షన్ల పంపిణీ విషయంలో జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే నెల 1న లబ్దిదారులకు బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్.. కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. బ్యాంకు అకౌంట్లు లేని వారు, దివ్యాంగులు, రోగులకు మే 5వ తేదీలోపు ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేయాలన్నారు. మే నెలలో ఫించన్ల కోసం సచివాలయాలకు రానవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు.

పెన్షన్ల పంపిణీకి సంబంధించి జిల్లా కలెక్టర్లతో పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమ చేయాలన్నారు. బ్యాంకు ఖాతాలు లేని లబ్దిదారులకు మే 5వ తేదీ లోపు వారి ఇంటి వద్దే పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేయాలన్నారు. పెన్షన్ల పంపిణీలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఈసీ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా ఈసారి విధివిధానాల్లో మార్పులు చేశారు అధికారులు.

గత నెల పెన్షన్ల పంపిణీలో తీవ్ర గందరగోళం జరిగింది. లబ్దిదారులు సచివాలయాలకు క్యూ కట్టారు. ఎండలో గంటల తరబడి నిల్చోలేక తీవ్రమైన ఇబ్బందులు పడ్డారు. పెన్షన్ కోసం వెళ్లిన కొందరు వృద్ధులు చనిపోయిన ఘటనలు వెలుగుచూశాయి. గతంలో వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్దిదారులకు పెన్షన్లు అందజేసేవారు. అయితే, ఎన్నికల కోడ్ కారణంగా అది నిలిచిపోయింది.

Also Read : దమ్ము, ధైర్యం ఉంటే మళ్లీ ఆ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పండి- చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

ట్రెండింగ్ వార్తలు