Cm Jagan : దమ్ము, ధైర్యం ఉంటే మళ్లీ ఆ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పండి- చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

జగన్ రూపాయి ఇస్తే నువ్వు 2 రూపాయలు ఇస్తానంటావ్. జగన్ 4 ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావ్.

Cm Jagan : దమ్ము, ధైర్యం ఉంటే మళ్లీ ఆ వ్యవస్థను తీసుకొస్తానని చెప్పండి- చంద్రబాబుకు సీఎం జగన్ సవాల్

gan Slams Chandrababu Naidu

Updated On : April 28, 2024 / 5:50 PM IST

Cm Jagan : చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. తన పేరు చెబితే అమ్మఒడి, చేయూత, పెన్షన్లు వంటి ఎన్నో పథకాలు గుర్తుకొస్తాయన్నారు. చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకం పేరు కూడా గుర్తుకు రాదన్నారు జగన్. జన్మభూమి కమిటీలు మళ్లీ తీసుకొస్తాం అని చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు ఓటేస్తే చంద్రముఖిని ఇంటికి తెచ్చుకున్నట్లేనని ఫైర్ అయ్యారు జగన్.

”జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు. పొరపాటు జరిగితే, చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు. అన్నీ మోసపోవటం అన్నది ప్రతీ ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి. చంద్రబాబును నమ్మడం అంటే పులి నోట్లో తలకాయ పెట్టడమే. ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నాం. పూర్తిగా ఫీజులు చెల్లిస్తూ ప్రతి పేద అక్క చెల్లెమ్మకు తోడుగా ఉంటూ, విద్యాదీవెనన వసతి దీవెన అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. అమ్మఒడి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. మీది జన్మభూమి కమిటీల వ్యవస్థ. నాది సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ.

నేను చంద్రబాబును అడుగుతున్నా.. మీరు పెట్టిన జన్మభూమి కమిటీల వ్యవస్థ మీద మీకు నమ్మకం, విశ్వాసం ఉంటే.. మళ్లీ మీరు అధికారంలోకి వస్తే మళ్లీ జన్మభూమి కమిటీలు తెస్తానని చెప్పే ధైర్యం మీకు ఉందా చంద్రబాబు? జగన్ రూపాయి ఇస్తే నువ్వు రెండు రూపాయలు ఇస్తానంటావ్. జగన్ నాలుగు ఇస్తే నువ్వు 8 ఇస్తానంటావ్.

అయ్యా చంద్రబాబూ జగన్ ఏం చేస్తున్నారో దానికంటే వేలంపాటలో వేసినట్లుగా అంతకన్నా మోసం చేసేందుకు నాలుగు ఇస్తాను పది ఇస్తాను అంటారు తప్ప.. 14ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన మీరు.. మీ హయాంలో నేను ఇది చేశాను, నేను చేసిన ఈ మంచిని చూసి నాకు ఓటు వేయండి అని అడిగే ధైర్యం, సత్తా మీకు ఉన్నాయా? చంద్రబాబును నమ్మడం అంటే.. చంద్రముఖిని నిద్రలేపడమే. చంద్రబాబును నమ్మడం అంటే.. వదల బొమ్మాళి వదల అంటూ పశుపతిని ఇంటికి తీసుకురావడమే” అని ధ్వజమెత్తారు సీఎం జగన్.

సీఎం జగన్ మలి విడత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు. అనంతరం వెంకటగిరిలో పర్యటించారు జగన్. అక్కడ రోడ్ షో లో మాట్లాడుతూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు.

Also Read : సీఎం జగన్ వరాల జల్లు.. 9 ప్రధాన హామీలతో వైసీపీ మ్యానిఫెస్టో రిలీజ్