ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మళ్లీ వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం వైఎస్ఆర్ జయంతి రోజున జూలై 8న (బుధవారం) పట్టాల పంపిణీ కార్యక్రమం జరగాల్సి ఉంది. ఇందుకోసం ప్రభుత్వం భారీ ఏర్పాట్లు కూడా చేసింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడం కరెక్ట్ కాదని భావించిన ప్రభుత్వం, మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. కరోనా కేసులు తగ్గుముఖం పడితే ఆగస్టు 15న పేదలకు పట్టాలను ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం.
పలు మార్లు వాయిదా పడిన ఇళ్ల పట్టాల పంపిణీ:
రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షలమందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కాకముందే పంపిణీ చేయాలనుకుంది. ముందు సంక్రాంతి కానుకగా ఇవ్వాలని భావించారు. తర్వాత అనివార్య కారణాలతో అంబేద్కర్ జయంతి రోజుకు వాయిదా వేశారు. తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చాయి. తర్వాత కరోనా, లాక్‌డౌన్ దెబ్బకు ఆగిపోయాయి. తర్వాత లాక్‌డౌన్ ఎత్తేయడంతో ఇప్పుడు వైఎస్ జయంతి రోజు జూలై 8న ఇవ్వాలనుకున్నారు. కానీ కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రభుత్వం మళ్లీ వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో ప్రజలంతా ఒకే సారి గుంపుగా చేరే అవకాశం ఉంది. దీంతో కరోనా విస్తృతంగా వ్యాపించే ప్రమాదం ఉన్న కారణంగా మరోసారి ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని వాయిదా వేసింది ఏపీ సర్కార్.
ఏపీలో కరోనా విజృంభణ:
ఏపీలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని రోజులుగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 998 కరోనా పాజిటివ్ కేసులు, 14 మరణాలు నమోదవడం ఆందోళనకు గురి చేస్తోంది. ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 18,697కి పెరిగింది. కరోనా మరణాల 232కి చేరింది.