YSR Matsyakara Bharosa Scheme(Photo : Google)
YSR Matsyakara Bharosa Scheme: ఏపీ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నారు సీఎం జగన్. ఆర్థికంగా సాయం చేస్తూ భరోసా కల్పిస్తున్నారు. పలు స్కీమ్స్ కింద లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్న విషయం విదితమే. తాజాగా మరో స్కీమ్ కింద లబ్దిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేయనున్నారు ముఖ్యమంత్రి జగన్.
వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకంలో భాగంగా సీఎం జగన్ రేపు (మే 16) లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. బాపట్ల జిల్లా నిజాంపట్నంలో నిర్వహించనున్న సభలో జగన్ బటన్ నొక్కి నేరుగా రూ.231 కోట్లను జమ చేస్తారు. ఈ పథకం కింద అర్హులైన ఒక్కో మత్స్యకార కుటుంబానికి రూ.10వేలు అందుతాయి.
ప్రతీ ఏటా సముద్రంలో చేపల వేటపై కొంత కాలం నిషేధం ఉంటుంది. ఆ సమయం ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 మధ్య కాలంలో ఉంటుంది. ఈ సమయంలో మత్స్యకార కుటుంబాలు ఇబ్బంది పడకూడదని ప్రభుత్వం వారికి ఆర్థికసాయం అందిస్తోంది. అదే వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్.
ఈ ఏడాది మొత్తం 1,23,519 మందిని అర్హులుగా గుర్తించారు. ఒక్కో కుటుంబానికి రూ.10 వేల చొప్పున రూ.123.52 కోట్ల ఆర్థిక సాయం అందించనుంది ప్రభుత్వం. దాంతోపాటు ఓఎన్‌జీసీ సంస్థ పైప్ లైన్ పనుల కారణంగా జీవనోపాధి కోల్పోయిన కోనసీమ, కాకినాడ జిల్లాల్లోని 23,458 మత్స్యకార కుటుంబాలకు అందిస్తున్న దాదాపు రూ.108 కోట్ల ఆర్థిక సాయంతో కలిపి.. మొత్తం రూ. 231 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు.
తాజాగా అందిస్తున్న ఈ ఆర్థిక సాయంతో కలిపి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఇప్పటివరకు కేవలం వైఎస్ఆర్ మత్స్యకార భరోసా స్కీమ్ కింద మాత్రమే అందించిన మొత్తం సాయం రూ. 538 కోట్లు. ఏటా రూ. 10 వేల చొప్పున ఈ ఒక్క పథకం ద్వారానే ఒక్కో కుటుంబానికి ఇప్పటికే రూ.50 వేల లబ్ధి చేకూరింది. గతంలో వేట నిషేధ భృతి రూ.4వేలు ఉండగా.. జగన్ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.10వేలకు పెంచింది.
Also Read..Dharmana Prasada Rao: పారదర్శక చిట్ ఫండ్ వ్యాపారం కోసమే ఇ-చిట్స్ ఎలక్ట్రానిక్ విధానం
* వైఎస్ఆర్ మత్స్యకార భరోసా పథకం కింద 21 నుంచి 60 వయసు లోపు మత్స్యకారులగా జీవనోపాధి పొందుతున్న వారు అర్హులు.
* ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది.
* సముద్ర జలాల్లో చేపలు, రొయ్యల సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, రొయ్యల సంరక్షణ కోసం ఈ నిర్ణయం.
* చేపల వేట నిషేధం సమయంలో మత్స్యకారులు ఇబ్బంది పడకుండా ఆర్థిక సాయం.
* అర్హులైన మత్స్యకార కుటుంబాలకు సాయం.
* ఈ పథకం 3 ఎకరాల మాగాణి లేదా 10 ఎకరాల మెట్ట, రెండు కలిపి 10 ఎకరాలకు మించి భూమి ఉన్నవాళ్లకు వర్తించదు.
* అర్బన్ ప్రాంతాల్లో వెయ్యి చదరపు అడుగుల విస్తీర్ణానికి మించి ఇల్లు ఉన్న వాళ్లు కూడా అనర్హులు.
* గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు.. అదే అర్బన్ ప్రాంతాల్లో అయితే 1.44 లక్షలలోపు వార్షిక ఆదాయం మాత్రమే ఉండాలి.
* ఐటీ చెల్లింపుదారులు ఈ పథకానికి అనర్హులు.
* అంతేకాదు సంక్షేమ పథకాలు పొందిన వారు, మత్స్యకార పింఛన్ పొందుతున్న వారు అనర్హులు.
* ప్రభుత్వ, ప్రభుత్వరంగ ఉద్యోగాలు చేస్తున్న వారు అనర్హులు.