AP Govt Local Cadre Policy : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రం అంతా 2 మల్టీ జోన్లు.. 95 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు స్థానికులకే..
AP Govt Local Cadre Policy : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక కోటా నిర్ణయిస్తూ ఆదేశాలు జారీ చేసింది
ap govt local cadre for government jobs and two multi zones new orders
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
- రాష్ట్రం అంతా 2 మల్టీ జోన్లు
- స్థానిక కోటా 95 శాతం
AP Govt Local Cadre Policy : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు 6 జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 2 మల్టీ జోన్లుగా వర్గీకరిస్తూ నిర్ణయం తీసుకుంది. అలానే ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95 శాతం రిజర్వేషన్లు.. ఓపెన్ కేటగిరీకి 5 శాతంగా నిర్ణయించారు. అలానే రాష్ట్ర స్థాయి పోస్టులను మల్టీ జోనల్ పోస్టులుగా మార్పు చేశారు. దీనికి సంబంధించి 2025, డిసెంబరు 15న ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వులను అనుసరించి.. కేంద్ర హోం శాఖ అదే రోజు జారీ చేసిన ‘ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్-2025’ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్‌లో పొందుపరిచింది.
మార్పులు ఇలా..
- ఇప్పటి వరకు రాష్ట్ర కేడర్ పోస్టులుగా ఉన్న సీటీవో, డిప్యూటీ కలెక్టర్, డీఎస్పీ పోస్టులను మల్టీ జోనల్ కిందకు మార్చారు.
- గతంలో డిప్యూటీ కలెక్టర్లు, సీటీవోలు, డీఎస్పీలు ఏ జిల్లాకైనా బదిలీపై వెళ్లేవారు. ఇక మీదట అలా కుదరదు. ఒకవేళ స్పౌజ్ గ్రౌండ్లో వెళ్లాలని కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు.
- గతంలో జిల్లా పోస్టులకు స్థానికులకు 85 శాతం.. ఓపెన్ కోటాకు 15 శాతం కేటాయించేవారు. అలానే జోనల్ పోస్టులకు 70:30, మల్టీజోనల్ పోస్టులకు 60:40గా ఉండేది. కానీ ఇప్పుడు ఆయా పోస్టులకు లోకల్, ఓపెన్ కోటాను 95:5గా చేశారు.
- గతంలో 4-10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆప్రాంతంలో స్థానికులుగా గుర్తించేవారు. ఇప్పుడు 1-7 వ తరగతి వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివితే ఆ ప్రాంతానికే స్థానికులుగా గుర్తిస్తారు.
- సచివాలయం, హెచ్‌వోడీ, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాల నుంచి ఉద్యోగులు లోకల్, జోనల్, మల్టీజోనల్ కేడర్లలో డిప్యుటేషన్‌పై వెళ్లొచ్చు.
- విభజనపై అభ్యంతరాలు ఉన్న ఉద్యోగులు 60 రోజుల్లోగా వినతిపత్రం ఇవ్వచ్చు. దీనిపై ప్రభుత్వం సంబంధిత వ్యవహారాలు చూసే కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంది.
ఇవీ మల్టీజోన్లు
మల్టీజోన్-1:
- జోన్-1లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి,
- జోన్-2లోని తూర్పు గోదావరి, అంబేడ్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు, కాకినాడ
- జోన్-3లోని కృష్ణా జిల్లా, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలను మల్టీజోన్-1గా వర్గీకరించారు.
మల్టీజోన్-2:
- జోన్-4లోని గుంటూరు, నెల్లూరు, పల్నాడు, ప్రకాశం, బాపట్ల
- జోన్ -5లోని చిత్తూరు, కడప, తిరుపతి, అన్నమయ్య,
- జోన్-6లోని శ్రీసత్యసాయి, అనంతపురం, నంద్యాల, కర్నూలు, జిల్లాలను మల్టీజోన్-2గా వర్గీకరించారు.
