10 Lakh Fd For Children
10 Lakh FD For Children : కరోనా మహమ్మారి వల్ల తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలను ఆదుకోవాలని, వారికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ వల్ల తల్లిదండ్రులు(ఇద్దరూ) మరణించిన.. 18ఏళ్ల లోపు వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందన్నారు. అంతేకాదు తల్లిదండ్రులిద్దరు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన వారై ఉండాలని అధికారులు తెలిపారు.
కరోనా కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పేరుతో ప్రభుత్వం రూ.10 లక్షల ఫిక్డ్స్ డిపాజిట్ చేయనుంది. ఆ మొత్తంపై నెల నెల వచ్చే వడ్డీతో పిల్లల అవసరాలు తీర్చాలని సీఎం జగన్ సూచించారు. అలాగే, ఆ పిల్లలకు 25ఏళ్లు నిండిన తర్వాత ఈ డిపాజిట్ మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించారు.
కరోనా సెకండ్ వేవ్ ఏపీని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. కొన్ని రోజులుగా ప్రతిరోజూ దాదాపు 20వేల కేసులు, వందకు పైగా మరణాలు నమోదు కావడం కలవర పెడుతోంది. కరోనా దెబ్బకు వందలాది కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయి. తల్లిదండ్రుల మరణంతో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ చిన్నారుల విషయంలో మానవతా కోణంలో ఆలోచన చేశారు. కోవిడ్ మృతుల కుటుంబాలకు ఊరటనిచ్చేలా కొత్త పథకాన్ని ప్రకటించారు. కరోనాతో మృతి చెందిన వారి పిల్లలను ఆదుకునేందుకు రూ.10లక్షల ఆర్థికసాయం చేయాలని నిర్ణయించారు.