Cm Chandrababu: యూరియాతో క్యాన్సర్..! సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. రైతులకు అవగాహన కల్పించాలని సూచన..
అందుకోసం పంజాబ్ లో పంటలను కేస్ స్టడీగా చూడాలన్నారు సీఎం చంద్రబాబు.

Cm Chandrababu: యూరియా వాడకంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ల సదస్సులో వ్యవసాయ రంగంపై చర్చించిన సీఎం చంద్రబాబు.. యూరియా అధికంగా వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందన్నారు. యూరియా వాడకంపై రైతులకు అవగాహన కల్పించాలని
సూచించారు.
యూరియా ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ పంట వస్తుందని అనుకోవటం సరికాదన్నారు. అందుకోసం పంజాబ్ లో పంటలను కేస్ స్టడీగా చూడాలన్నారు సీఎం చంద్రబాబు. యూరియా వాడకం తగ్గించుకోవాలని సూచించిన సీఎం చంద్రబాబు.. వచ్చే ఏడాది నుంచి యూరియా వాడకం తగ్గించే రైతులకు ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపారు.
” ఏపీలో టాప్ 5 రోగాల జాబితాలో క్యాన్సర్ ఉంది. యూరియా ఎక్కువగా వాడటం వల్లే మన మిర్చిని చైనా తిప్పి పంపింది. ఆక్వాలో కూడా అదే జరిగింది. కొన్ని యూరప్ దేశాలు మన ఉత్పత్తుల ధరలు తగ్గిస్తున్నాయి. ప్రజల ఆహారపు అలవాట్లు మారిపోతున్నాయి. కార్బొహైడ్రేట్స్ తగ్గిస్తున్నారు. ప్రజలు తినే ఫైన్ వెరైటీలు పండించాలి” అని సీఎం చంద్రబాబు రైతులకు సూచించారు.
”స్టెరాయిడ్స్ వాడినట్లుగా యూరియా వాడుతున్నాం. అది చాలా పెద్ద ప్రాబ్లమ్. పంట ఎక్కువ వస్తుందనే ఆశతో యూరియాను వాడేస్తున్నారు. నేను మీకు చాలాసార్లు చెప్పాను. పంజాబ్ ఒక కేస్ స్టడీ. పంజాబ్ లో ఇవాళ రెండు రైళ్లు క్యాన్సర్ పేషంట్లను ఢిల్లీకి తీసుకెళ్తున్నాయి. పెస్టిసైడ్స్, యూరియా, ఫెర్టిలైజర్స్, పొల్యూషన్.. ఏదో ఒక దాని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. సాయిల్ ఫెర్టిలిటీ, డెఫీషియన్సీని బట్టి మైక్రో న్యూట్రియంట్స్ సప్లిమెంట్ చేయాలి. రైతులు అలా చేయడం లేదు. దాని వల్ల భూమి తన సారాన్ని కోల్పోతోంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఏం చేయాలో వర్కౌట్ చేద్దాం” అని సీఎం చంద్రబాబు అన్నారు.