CM Chandrababu Naidu
AP Liquor: లిక్కర్ కేసు వ్యవహారంపై రాజకీయం సెగలు కక్కుతున్న వేళ.. ఏపీలో నకిలీ మద్యం కేసు వ్యవహారం… పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. ఇందులో టీడీపీ నాయకులకు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో.. ఈ వ్యవహారంలోకి సీఎం చంద్రబాబు డైరెక్ట్‌గా రంగంలోకి దిగారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయ్. సినిమాను మించి ట్విస్టులు కనిపిస్తున్న ఈ కేసులో.. మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసలు ఈ కేసు వెనక ఏం జరుగుతోంది.. వైసీపీ పేరు ఎందుకు తెరమీదకు వస్తోంది..
ఏపీలో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా ములకలచెరువులో భారీగా నకిలీ మద్యం దొరికింది. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. సీఎం చంద్రబాబు డైరెక్ట్‌గా రంగంలోకి దిగి.. దీనిపై సమీక్షా నిర్వహించారు. సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ విషయంలో టీడీపీ నాయకుల ప్రమేయంపై వివరాలు తెప్పించుకున్న చంద్రబాబు… ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు.
దీంతో తంబళ్లపల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి దాసరిపల్లె జయచంద్రా రెడ్డితో పాటు స్థానిక టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఇద్దరి ప్రమేయంపై సమగ్ర విచారణ చేపట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Also Read: కేటీఆర్, హరీశ్ దూకుడు.. కేసీఆర్ ఇచ్చిన టార్గెట్ అదేనా? వీళ్ల దూకుడు ఆపేదెవరు?
ఇక ఈ వ్యవహారంలో జయచంద్రారెడ్డి వ్యక్తిగత కార్యదర్శి రాజేశ్, సన్నిహితుడు జనార్దన్‌రావు, సమీప బంధువుల పాత్ర ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిపై ఎక్సైజ్ అధికారులు కేసు నమోదు చేశారు. జయచంద్రారెడ్డి వ్యవహారం మొదట నుంచీ వివాదాస్పదంగానే ఉందని తెలుస్తోంది.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబానికి సన్నిహితుడిగా.. దక్షిణాఫ్రికాలో ఆ కుటుంబంతో వ్యాపార లావాదేవీలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నప్పటికీ.. టీడీపీ అధిష్ఠానం 2024 ఎన్నికల్లో జయచంద్రారెడ్డికి తంబళ్లపల్లె టికెట్ ఇచ్చింది. 10వేలకు పైగా ఓట్లతో ఆయన ఓడిపోయారు.
ఎన్నికల్లో గెలుపు కోసం ఆయన ఏమాత్రం కృషి చేయలేదని అప్పట్లో టీడీపీ వర్గాలు ఆరోపించాయ్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచీ నియోజకవర్గంలో అన్ని వర్గాలనూ సమన్వయం చేసుకుని వెళ్లడం లేదనే ఆరోపణలు ఉన్నాయ్. ఇప్పుడు నకిలీ మద్యం వ్యవహారం మెడకు చుట్టుకోవడంతో.. అధిష్ఠానం ఆయనపై వేటు వేసింది.
నకిలీ మద్యం కేసులో కీలక నిందితుల కోసం ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు వేట మొదలుపెట్టారు. ఈ కేసులో ఇప్పటికే తమిళనాడు, ఒడిశాతో పాటు.. పలు ప్రాంతాలకు చెందిన 10 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్ వెనకున్న నలుగురు కీలక నిందితులు మాత్రం పరారీలో ఉన్నారు. వారిలో తెనాలి వాసి కొడాలి శ్రీనివాసరావు ఒకరు. ఐతే ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయ్.
వైసీపీ ప్రభుత్వ కాలం నుంచి నకిలీ మద్యం రాకెట్ యథేచ్ఛగా సాగుతోందని.. అప్పటి ప్రభుత్వ పెద్దల అండదండలతో సాగించిన దందాను.. కూటమిసర్కార్ వచ్చాక టీడీపీ నాయకుల సాయంతో కొనసాగిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. అప్పటి ఓ వైసీపీ కీలక నేతకు శ్రీనివాసరావు బంధువని… అతడి అండతోనే గత ప్రభుత్వంలోని ఐదేళ్లూ గుంటూరు జిల్లా తెనాలి, గుంటూరు, బాపట్ల జిల్లా రేపల్లె, చెరుకుపల్లి, నిజాంపట్నంలో నకిలీ మద్యం సీసాలను ప్రభుత్వ మద్యం దుకాణాలకు సరఫరా చేసి డబ్బు వెనకేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
నకిలీ మద్యం కేసుకు సంబంధించి.. సీఎం చంద్రబాబు రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఏ చిన్న తప్పు జరిగినా.. ఉపేక్షించేది లేదు అన్నట్లుగా చంద్రబాబు తీరు కనిపిస్తోంది. నోరు అదుపులో పెట్టుకోవాలి.. పద్దతి మార్చుకోవాలి.. లేదంటే ఆల్టర్నేట్ చూసుకుంటానంటూ ఇప్పటికే ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారు. కొందరు టీడీపీ ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత స్టార్ట్ అయిందని రిపోర్టులు అందాయనే ప్రచారం జరుగుతున్న వేళ.. సీఎం చంద్రబాబు ప్రతీ విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు.
ఏ చిన్న తప్పు కూడా ఉండకూడదని.. తప్పు చేసిన వాళ్లు పార్టీలో ఉండకూడదు అన్నట్లుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు నకిలీ మద్యం కేసులోనూ చంద్రబాబు ఇంత సీరియస్‌గా దృష్టిసారించడం వెనక కారణం అదే అనే చర్చ జరుగుతోంది. ఇక అటు వైసిపికి ఈ కేసు అస్త్రంగా మారడంతో.. మరింత అలర్ట్ అయ్యారు. ఇందులో ఎంత పెద్దవారి ప్రమేయం ఉన్నా వదిలి పెట్టకూడదని అధికారులు ఇప్పటికే ఆదేశించారు.