కేటీఆర్‌, హరీశ్ దూకుడు.. కేసీఆర్‌ ఇచ్చిన టార్గెట్‌ అదేనా? వీళ్ల దూకుడు ఆపేదెవరు?

జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కేటీఆర్, హరీశ్. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు.

కేటీఆర్‌, హరీశ్ దూకుడు.. కేసీఆర్‌ ఇచ్చిన టార్గెట్‌ అదేనా? వీళ్ల దూకుడు ఆపేదెవరు?

Updated On : October 7, 2025 / 1:28 PM IST

BRS: గులాబీబాస్ డైరెక్షన్.. బావబామ్మర్దుల యాక్షన్. కట్ చేస్తే.. కారు పార్టీ జోరు మీద కనిపిస్తోంది. కేసీఆర్ దిశానిర్ధేశంలో కేటీఆర్, హరీశ్ రావు ఏకతాటిపై దూసుకుపోతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు.. స్థానిక సంస్థల ఎన్నికలపై వీళ్లిద్దరూ ఈసారి సీరియస్గా వర్కవుట్ చేస్తున్నారు.

అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంలో.. పార్టీని ఏకతాటిపై ముందుకు తీసుకుపోవడంతో తొలిసారి ఈ ఇద్దరూ ఒక్కటై తమదైన స్టైల్లో ముందుకు వెళ్తూ కేడర్లో ఉత్సాహం నింపుతున్నారు. దీంతో గతంలో ఎప్పుడూ లేని జోష్ ఇప్పుడు కారు పార్టీలో కన్పిస్తోంది

ఓ వైపు జూబ్లిహిల్స్ బైపోల్.. మరోవైపు రాబోతున్న స్థానిక ఎన్నికలు.. ఇలాంటి పరిణామాల మధ్య.. తెలంగాణ రాజకీయం రోజురోజుకు మరింత రసవత్తరంగా మారుతోంది. రేవంత్ సర్కార్పై తగ్గేదే లే అని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్లో ఇప్పుడు కొత్త జోష్ కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు దూకుడే దీనికి కారణం అనే చర్చ జరుగుతోంది. ఎర్రవల్లి ఫాంహౌస్లో అధినేత కేసీఆర్తో వరుస సమావేశాల తర్వాత… కేటీఆర్, హరీష్ రంగంలోకి దిగారని తెలుస్తోంది.

Also Read: AP pension guidelines: పెన్షన్లు అందడంలేదా? మీకు గుడ్‌న్యూస్‌.. ఇలా చేస్తేసరి ఇకపై..

కేసీఆర్ దిశానిర్దేశంతో.. ఓ వైపు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూనే.. మరోవైపు జూబ్లీహిల్స్ బైపోల్.. ఇంకోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించారు బావబామ్మర్దులు. ఈ ఇద్దరి దూకుడుతో.. పార్టీ కేడర్లో కొత్త జోష్ కనిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంత కోఆర్టినేషన్ తో చావోరేవో అన్నట్లు దూసుకుపోతున్నారు ఈ ఇద్దరు కీలక నేతలు

అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు.. కేటీఆర్, హరీష్ రావులు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తున్నారు. తెలంగాణ భవన్లో వరుస సమావేశాలు.. పార్టీలో చేరికలు, జిల్లాలవారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షలు, మెరుపు పర్యటనలు, ముఖ్యనేతలతో భేటీలు.. ఇలా ఈ ఇద్దరి బిజీబిజీగా గడిపేస్తున్నారు. పార్టీ అధినేత కేసీఆర్తో వరుస భేటీల తర్వాత.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఈ ఇద్దరు ఎటాక్ స్పీడప్ చేశారు.

ప్లాన్ ప్రకారం ముందుకు

కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించడంతో పాటు.. ప్లాన్ ప్రకారం ముందుకు వెళ్తున్నారు. కేసిఆర్ ఆదేశాలతో.. ఓవైపు రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ బాకీ కార్డులు పంచుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గడిచిన 22నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులు, మహిళలు, యువకులు, విధ్యార్దులు.. ఇలా వివిధ వర్గాల తెలంగాణ ప్రజలకు ఎంతమేర బాకీ పడిందో లెక్కలతో సహా కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు స్వయంగా ఇంటింటికి తిరిగి.. కాంగ్రెస్ బాకీ కార్డులను పంచుతున్నారు.

బాకీ కార్డు ప్రచారానికి మంచి స్పందన రావడం.. కేటీఆర్, హరీష్ స్వయంగా ఈ కార్యక్రమాల్లో భాగం కావడంతో.. గులాబీ పార్టీలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. ఈ ఇద్దరు రంగంలోకి దిగడంతో.. ముఖ్య నేతలు, కార్యకర్తలు కూడా.. వారి వారి జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. ఇక అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికపై ప్రత్యేకంగా దృష్టి సారించారు కేటీఆర్, హరీశ్. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ.. ఉపఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రచిస్తున్నారు. అవసరం, అవకాశం మేరకు.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈ ఇద్దరు పర్యటిస్తున్నారు.

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ బాకీ కార్డులను పంచే కార్యక్రమంలో ఇంటింటికి బాకీ కార్డులు పంచుతూ హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికలపైనా కేటీఆర్, హరీష్ రావులు దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు జిల్లాల్లో పర్యటిస్తూ నేతలను, క్యాడర్ ను లోకల్ బాడీ ఎన్నికలకు సమాయుత్తం చేస్తున్నారు.

పార్టీ కేడర్లో ఉత్సాహం నింపడమే కాదు.. కాంగ్రెస్, బీజేపీ నుంచి బీఆర్ఎస్ లోకి చేరికలపైనా వర్కౌట్ చేస్తున్నారు. ఓవరాల్ గా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా బావ బామ్మర్దులు ఇద్దరూ.. అన్ని కార్యక్రమాలను సమన్వయంతో ముందుకు వెళ్తుండటంతో గులాబీ పార్టీ నేతలు, కేడర్లో నయా జోష్ కనిపిస్తోందన్న టాక్ వినిపిస్తోంది.