Botsa Satyanarayana : అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలం.. సమ్మె విరమణ.. నేటి నుంచి విధుల్లోకి

అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది

Minister Botsa

Anganwadi workers Strike: అంగన్వాడీలతో ఏపీ ప్రభుత్వం చర్చలు సఫలమయ్యాయి. అంగన్వాడీల సమస్యల పట్ల ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సోమవారం రాత్రి అంగన్వాడీ యూనియన్ నాయకులతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చర్చించారు. రెండు దఫాలుగా అంగన్వాడీలతో చర్చలు జరపగా.. చివరికి ఫలించాయని మంత్రి బొత్స మీడియా సమావేశంలో తెలిపారు. ఈ చర్చల్లో అంగన్వాడీలు ప్రభుత్వం ముందు ఉంచిన 11 డిమాండ్లలో 10 నెరవేర్చేందుకు ప్రభుత్వం తరపున అంగీకారం తెలిపింది. జీతాల పెంపును జూన్ నుంచి అమలు చేస్తామని హామీ ఇవ్వడంతో అంగన్వాడీలు అంగీకరించారు. దీంతో ప్రభుత్వం, అంగన్వాడీల మధ్య చర్చలు సఫలం అయ్యాయి. మంగళవారం నుంచి అంగన్వాడీలు విధుల్లోకి చేరనున్నారు.

Also Read : Ram Mandir Road Trip Guide : అయోధ్య రామమందిర దర్శనానికి వెళ్తున్నారా? రోడ్డుమార్గంలో ఎలా చేరుకోవాలంటే? రోడ్ ట్రిప్ గైడ్ ఇదిగో..!

విధుల్లో చేరుతాం : ప్రధాన కార్యదర్శి సబ్బరావమ్మ
సమ్మె విరమిస్తున్నట్లు, మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతున్నట్లు ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సబ్బరావమ్మ చెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని, సమ్మెను విరమిస్తున్నట్లు చెప్పారు. మంగళవారం నుంచి విధుల్లో హాజరవుతామని అన్నారు. జీతాల పెంపుపై నిర్ధిష్ఠ నిర్ణయం జులైలో చేస్తామని చెప్పారని, మాకు జీతాల పెంపు ఎంత అనేది కూడా రాతపూర్వకంగా ఇస్తామని చెప్పారని సుబ్బరావమ్మ తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్ ను పెంచుతామని హామీ ఇచ్చారని, మా డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని అన్నారు. అంగన్వాడీలకు వైఎస్ఆర్ బీమా ఇస్తామని, రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు సుబ్బరావమ్మ అన్నారు. టీఏ బిల్లుల అంశంలో కేంద్రం నుంచి వచ్చేలోపు రాష్ట్రం ఇవ్వడానికి ఒప్పుకుందని, సీఎఫ్ఎంఎస్ తీసేసి సంక్షేమ పథకాలు అంగన్వాడీలకు వర్తింపచేస్తామని అన్నారని, సమ్మెకాలానికి జీతం ఇవ్వడంతోపాటు, కేసులు ఎత్తేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఏపీ అంగన్వాడీ ప్రధాన కార్యదర్శి సుబ్బరావమ్మ అన్నారు.

Also Read : Hyderabad Real Estate : రియల్ ఇన్‌కమ్.. టీ-సర్కార్‌కు కాసుల పంట.. భారీగా ఆదాయం ఇక్కడి నుంచే..!

మంత్రి బొత్స సత్యనారాయణ ఏమన్నారంటే..
అంగన్వాడీలతో చర్చలు అనంతరం మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. అంగన్వాడీలతో జరిపిన చర్చలు సఫలం అయ్యాయని, మంగళవారం నుంచి విధుల్లోకి చేరుతారని తెలిపారు. 11 డిమాండ్లలో 10 ఇప్పటికే పరిష్కారం చేశామని, జులైలో జీతాలు పెంచుతామని అన్నారు. వేతనాల పెంపుపై చర్చల్లో తీసుకున్న నిర్ణయాన్ని మినిట్స్ లో నమోదు చేస్తామని అన్నారు. ఉద్యోగ విరమణ సమయంలో ఇచ్చే ప్రయోజనాన్ని వర్కర్లకు 50వేల నుంచి 1.20లక్షలకు పెంచామని, హెల్పర్ కు రూ. 60వేలకు పెంచాలని నిర్ణయం తీసుకున్నామని, మట్టి ఖర్చులు రూ.20వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు. సమ్మెకాలానికి జీతాలు ఇస్తామని, సమ్మె సమయంలో పెట్టిన కేసులు ఎత్తేస్తామని అంగన్వాడీలకు హామీ ఇవ్వడం జరిగిందని బొత్స చెప్పారు. గ్రాట్యువిటీకి సంబంధించి కేంద్రం నిబంధనలను పాటిస్తామని అన్నారు. ఉద్యోగ విరమణ వయస్సు 60 నుంచి 62ఏళ్లకు పెంచామని, అంగన్వాడీ రోజువారీ కార్యక్రమాల్లో సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నామని బొత్స తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఉద్యోగుల పక్షపాతి ప్రభుత్వం అని, కక్షసాధింపు చర్యలకు పాల్పడే ఆలోచన మా ప్రభుత్వానికి లేదని మంత్రి బొత్సా సత్యనారాయణ చెప్పారు.

అంతకుముందు చర్చల్లో భాగంగా రాష్ట్రంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలని మంత్రి బొత్స విజ్ఞప్తి చేశారు. పలు జిల్లాల్లోని అంగన్‌వాడీలు ఇప్పటికే విధుల్లో హాజరవుతున్నారని ఆయన అన్నారు. రెండు మూడు జిల్లాల్లో పూర్తిస్థాయిలో తిరిగి విధులకు హాజరయ్యారని మంత్రి బొత్స తెలిపారు. మిగిలిన జిల్లాల్లోకూడా అంగన్‌వాడీలు తిరిగి విధులకు హాజరవుతున్నారని అన్నారు. తిరిగి విధుల్లో జాయిన్‌ అవుతున్న అంగన్వాడీలందరికీ ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని చెప్పారు.  మిగిలిపోయిన వారు కూడా వెంటనే విధులకు హాజరుకావాలని కోరుతున్నామన్నారు.

 

 

ట్రెండింగ్ వార్తలు