Gaddar Death : ప్రజాగానం మూగబోయింది, ఉద్యమ గీతానికి జోహార్- గద్దర్ మృతికి ఏపీ మంత్రి వేణు, నారా లోకేశ్ సంతాపం
ప్రజల వాణి ఆస్తమించిందన్న వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. Gaddar Death Condolence

Gaddar Death Condolence(Photo : Google)
Gaddar Death Condolence : ప్రజా గాయకుడు గద్దర్ మృతికి ఏపీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ సంతాపం తెలిపారు. ప్రజా గానం మూగబోయిందని అన్నారు. ప్రజల సమస్యలను తన వాణీతో తెలియచేసి బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేసిన వ్యక్తి గద్దర్ అని కీర్తించారు. ప్రజల వాణి ఆస్తమించిందన్న వార్త తీవ్రంగా కలిచివేసిందన్నారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. గద్దర్ కుటుంబ సభ్యలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు మంత్రి వేణు.
ప్రజా గాయకుడు గద్దర్ గొంతు మూగబోయిందని సమాచారం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను అని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. గద్దర్.. విప్లవోద్యమాలకి తన పాటనిచ్చారు. తెలంగాణ ఉద్యమ గళం అయ్యారు. ప్రజా యుద్ధనౌక గద్దర్ స్మృతిలో నివాళులు అర్పించారు. ప్రజల పాటకి జోహార్. ఉద్యమగీతానికి జోహార్. గద్దర్ అమర్ రహే అని లోకేశ్ తన సంతాపం తెలియజేశారు.
Also Read..Gaddar: నీ పాటనై వస్తున్నానమ్మో అంటూ పలకరించే గద్దరన్న ఇకలేరు
ప్రజా గాయకుడు గద్దర్ మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 1949లో తూప్రాన్ లో జన్మించిన గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్ రావు. తన పాటలతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడటంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు.
సమాజంలోని అన్యాయాలను పాటల రూపంలో ప్రజలకు కళ్లకు కట్టినట్లు వివరించడంలో గద్దర్ ది అందెవేసిన చేయి. 1984లో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ప్రజల్లో చైతన్యం నింపారు. దళితులు, పేదల కోసం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహార్ రాష్ట్రాల్లోనూ నాటకాలు వేశారు. కింద ధోతి, పైన గొంగళి ధరించే వారు గద్దర్.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ కీలక పాత్ర పోషించారు. తన పాటలతో ఉద్యమానికి ఊపు తెచ్చారు. అమ్మా తెలంగాణమా, పొడుస్తున్న పొద్దు మీద లాంటి పాటలతో ప్రజల్లో ఉత్సాహాన్ని నింపి ఉద్యమంవైపు నడిపించేలా ప్రోత్సహించారు. తన పాటలతో ప్రజల్లో ఉద్యమ జ్వాల రగిలింపజేశారు. విద్యార్థులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగులు ఇలా సకల జనులు పదం పాడుతూ కదం తొక్కుతూ ముందుకు సాగేలా చేశారు.