Kottu Satyanarayana Questions Chandrababu
Kottu Satyanarayana Questions Chandrababu : స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబుకి ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పందించారు. చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ వచ్చింది కాబట్టి నారా భువనేశ్వరి చేపట్టిన నిజం గెలవాలి కార్యక్రమాన్ని ఉపసంహరించుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు. నిజం గెలిచిందో లేదో భువనేశ్వరి చెప్పాలని మంత్రి కొట్టు అన్నారు. భువనేశ్వరి చేస్తున్న కార్యక్రమంపై అంతా ముక్కున వేలేసుకుంటున్నారని విమర్శించారు.
జాతీయ పార్టీ అని ప్రకటించుకున్న టీడీపీ తెలంగాణలో పోటీ చేయకూడదని నిర్ణయించుకోవడం ఏమిటి? అని అడిగారు మంత్రి కొట్టు సత్యనారాయణ. అంటే, తెలంగాణలో టీడీపీకి డిపాజిట్లు కూడా రావని తేలిపోయినట్టేనా? అని వ్యాఖ్యానించారాయన. సైబర్ సిటీని తానే నిర్మించానని చెబుతున్న చంద్రబాబు అధ్యక్షత వహిస్తున్న టీడీపీ ఎన్నికల్లో ఎందుకు చేతులెత్తేసింది? అని మంత్రి కొట్టు అడిగారు.
Also Read : రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి చంద్రబాబు విడుదల
”ఏపీలోనూ సొంతంగా పోటీ చేసే సత్తా లేక జనసేనతో పొత్తు పెట్టుకున్న టీడీపీ జాతీయ పార్టీ అని ఎలా చెప్పుకుంటుంది? జనసేన కూడా తెలంగాణలో బీజేపీతో కలిసి పోటీ చేస్తోంది. ఏపీలో జనసేన-టీడీపీ పొత్తు ఎంతవరకూ నిలబడుతుందని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. మేముంటేనే మీరని జనసేన-టీడీపీ మధ్య క్షేత్రస్థాయిలో కుమ్ములాటలు జరుగుతున్నాయి. చంద్రబాబును జైల్లో పెడితే రోడ్డుపై పడుకుని పవన్ కల్యాణ్ నానా విన్యాసాలు చేశారు. చివరివరకూ వీరి పొత్తు నిలబడుతుందా? లేదా? అన్నది చూడాలి” అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.
”రాష్ట్రవ్యాప్తంగా వివిధ దేవాలయాల్లో అభివృద్ధి పనులు టెండర్లు పిలిచి పారదర్శకతతో జరుగుతున్నాయి. శ్రీశైలం, సింహాచలం, శ్రీకాళహస్తి, అన్నవరం తదితర దేవాలయాల్లో శాశ్వత ప్రాతిపదికన కొన్ని అభివృద్ధి పనులు చేపట్టాం. విజయవాడ కనకదుర్గ గుడిలోనూ మహా మండపాన్ని కూడా క్యూ కాంప్లెక్స్ గా మారుస్తాం. ఫ్లైఓవర్ నిర్మాణం కూడా చేపట్టాలని ప్రణాళిక చేస్తున్నాం. దేవాదాయశాఖలో 5కోట్ల రూపాయల పై పాడిన టెండర్లు అన్నింటినీ ఖరారు చేసేందుకు టెండర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నాం.
ప్రసాదాల తయారీలో వినియోగించే బియ్యం, శనగపప్పు, పంచదార, నెయ్యి లాంటి పదార్ధాల కొనుగోళ్లు, ధరలు ఒకేలా ఉండేలా చూస్తున్నాం. దీనికోసం అంతర్గతంగా ఓ డాష్ బోర్డును కూడా పెట్టాం. కోర్టుల్లో ఉన్న కేసులు ఉపసంహరించుకుంటే పదోన్నతుల అంశాన్ని త్వరితగతిన తేల్చాలని భావిస్తున్నాం. కేబినెట్ లో చర్చించి దేవాలయాల స్థాయిని కూడా పెంచాలని నిర్ణయం తీసుకున్నాం” అని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు.
Also Read : మీరు చూపిన అభిమానం జీవితంలో మర్చిపోలేను- జైలు నుంచి బయటకు వచ్చాక చంద్రబాబు