AP Rains
AP Rains : ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ నుంచి వచ్చే మూడు నాలుగు రోజులు ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. (AP Rains)
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. అది పశ్చిమ దిశగా కదులుతూ శుక్రవారం సాయంత్రానికి వాయవ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా – ఉత్తరాంధ్ర తీరాలను దాటే అవకాశం ఉందని ఈ క్రమంలో ఏపీలో పలు జిల్లాల్లో ఇవాళ, రేపు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
ఇవాళ (శుక్రవారం) ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, పిడుగులు పడే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపింది. వర్షాలు పడే సమయంలో ప్రజలు చెట్ల కింద, శిథిలావస్థలోని భవనాలు వద్ద ఉండరాదని, సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.