AP Weather: ఏపీలో పిడుగుల వానలు.. రేపు ఈ 5 జిల్లాలకు అలర్ట్..

పిడుగులు, ఉరుములతో కూడిన వానలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

  • Updated on- May 30, 2026 / 06:23 PM IST

AP Weather: ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు ఎండలు దంచికొడుతున్నాయి. వేడిగాలులు బేంబెలెత్తిస్తున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు, తీవ్రమైన ఉక్కపోతతో జనం విలవిలలాడిపోతున్నారు. మరోవైపు అకాల వర్షాలు వణికిస్తున్నాయి. పిడుగులతో కూడిన వానలు పడుతున్నాయి.

రాష్ట్రానికి వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. దక్షిణ ఒడిశా నుంచి ఉత్తరాంధ్ర వరకు ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో వానలు పడుతున్నాయి. రేపు 5 జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాల అవకాశం ఉందని తెలిపింది. అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు వర్ష సూచన చేసింది. మిగతా జిల్లాల్లోనూ చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు పడతాయని అంచనా వేసింది. పిడుగులు, ఉరుములతో కూడిన వానలు కురిసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని.. చెట్లు, విద్యుత్ స్తంభాల కింద నిలబడొద్దని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొంట పొలాల్లో పని చేసే రైతులు, పశుకాపరులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది.

ఇక, రాష్ట్రంలో శనివారం సాయంత్రం 5 గంటల వరకు పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు..

అనంతపురం జిల్లా హుస్సేన్‌పురంలో 51 మిమీ వర్షపాతం

కడప జిల్లా పెద్ద పసుపల్లెలో 45 మిమీ వర్షపాతం

చిత్తూరు జిల్లా గంగవరంలో 41.7 మిమీ వర్షపాతం

ఈ అకాల వానలతో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వానలు కురవడంతో వాతావరణం చల్లబడింది. దీంతో మండు టెండులతో, తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం కాస్త రిలాక్స్ అవుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 42 నుంచి 44 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదివారం 17 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మన్యం, పోలవరం, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో వడగాలుల హెచ్చరిక జారీ చేసింది. శనివారం నంద్యాల జిల్లా సంజామలలో 41.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని APSDMA సూచించింది.

Also Read: తిరుమల వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్.. శ్రీవాణి దర్శన టికెట్ల కేటాయింపులో మార్పులు